సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులకు మరింత చేరువ చేస్తూ డ్రోన్ల వినియోగాన్ని ప్రోత్సహించాలని, తద్వారా లాభదాయక ఫలితాలు సాధించేలా తోడ్పాటు అందించాలని జిల్లా పరిషత్ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు పేర్కొన్నారు. నైపుణ్యం కలిగిన వారితో ప్రత్యేక శిక్షణా శిబిరాలు నిర్వహించి రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. అన్ని రకాల సాంకేతిక ప్రక్రియలను పూర్తి చేసిన పిమ్మట క్షేత్ర స్థాయిలో ప్రయోగాత్మకంగా ప్రవేశ పెట్టాలని చెప్పారు. కలెక్టరేట్ మీటింగ్ హాలులో సోమవారం జరిగిన వ్యవసాయ సలహా మండలి సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా వ్యవసాయ ప్రణాళిక, నూతన సాంకేతిక పరిజ్ఞానం వినియోగంపై వ్యవసాయ అధికారులు వివరించగా వాటిపై స్పందించిన ఆయన రైతులకు ప్రయోజనం కల్పించేలా సాంకేతికతను చేరువ చేయాలని, వ్యవసాయాన్ని లాభాదాయకంగా మార్చి వారికి అండగా నిలవాలని హితవు పలికారు. రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం రాయితీపై అందించే డ్రోన్ల ఆవశ్యకతను రైతులకు తెలియజేయాలని, మందుల పిచికారీ విధానంలో వాటి వినియోగాన్ని విడమరిచి చెప్పాలని పేర్కొన్నారు. ఒక్కో మండలానికి మూడు డ్రోన్లు అందజేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, జిల్లాకు సుమారు 20 డ్రోన్లు వచ్చే అవకాశం ఉందని జిల్లా వ్యవసాయ అధికారి వి. టి. రామారావు జడ్పీ ఛైర్మన్ దృష్టికి తీసుకొచ్చారు. అలాగే వీటిని వినియోగించే వారికి శిక్షణ, సంబంధిత లైసెన్స్ ను ప్రభుత్వమే సులభతర రీతిలో అందజేస్తుందని వివరించారు. లోపభూయిష్టం లేకుండా ఈ ప్రాజెక్టును చేపట్టాలని జడ్పీ ఛైర్మన్ అధికారులకు సూచించారు. జిల్లా వాతావరణ పరిస్థితులు, నేల సారానికి అనుగుణంగా సాగు ప్రణాళికలు రూపొందించాలని రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులను సకాలంలో సరఫరా చేయాలని చెప్పారు. ఖరీఫ్, రబీ పంటకాలాలను దృష్టిలో ఉంచుకొని సాగునీరు విడుదల చేయాలని, ఆయా ప్రాజెక్టుల పరిధిలో కాలువల నవీనకరణ, ఇతర అభివృద్ధి పనులు చేపట్టాలని పేర్కొన్నారు. ఈ క్రాప్, ఈకేవైసీ ప్రక్రియలను మరింత సమర్ధవంతంగా నిర్వహించాలని, జిల్లా స్థాయి నుంచి క్షేత్ర స్థాయి వరకు సమాచార లోపం లేకుండా చూసుకోవాలని చెప్పారు.