ఏలూరు జిల్లా ద్వారకాతిరుమలలో గోపాలపురం నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్ మద్దిపాటి వెంకట్రాజు ఆధ్వర్యంలో టీడీపీ నేతలు ‘ఇదేం ఖర్మ.. మన రాష్ట్రానికి’ కార్యక్రమాన్ని నిర్వహించారు. జోన్-2 ఇంఛార్జ్‌గా ఉన్న ప్రత్తిపాటి పుల్లారావు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పొరపాటున ఫ్లోలో సైకిల్ పోవాలి అంటూ నినాదాలు చేశారు. పుల్లారావు నినాదాలతో అక్కడున్న టీడీపీ నేతలు, కార్యకర్తలు అవాక్కయ్యారు. వెంటనే తేరుకున్న మాజీ మంత్రి.. సారీ, సారీ అంటూ తన ప్రసంగాన్ని ముగించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మాజీ మంత్రి నిజం చెప్పారంటూ వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులు సెటైర్లు పేలుస్తున్నారు.
మరోవైపు జ్యోతిరావు పూలే జయంతిని పురస్కరించుకుని పాలకొల్లులో సామాజిక చైతన్య పాదయాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నిమ్మల, ఎమ్మెల్సీ అంగర రామమోహన్, మహాసేన నాయకుడు సరిపల్లి రాజేశ్‌లు పాల్గొన్నారు. నేతలు పూలే చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జగన్ పాలనలో దళితులు, బీసీలు, మైనార్టీలపై కక్ష సాధిస్తున్నారన్నారు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు. సామాజిక న్యాయం తెలుగుదేశం పార్టీ వల్లే సాధ్యమవుతుందన్నారు నిమ్మల. అణగారిన వర్గాలపై జరుగుతున్న అన్యాయంపై చైతన్యం తేవాలన్నదే ఈ యాత్ర ముఖ్య ఉద్దేశమన్నారు. 2024 ఎన్నికల్లో టీడీపీ గెలుపునకు ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలే సంకేతాలన్నారు.