వెనుకబడిన తరగతుల (బీసీల) కుల గణనకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బీసీ సంక్షేమం, సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ నేతృత్వంలో ఈ కమిటీని ప్రకటించింది. మహాత్మా జ్యోతిరావు ఫూలే జయంతి సందర్భంగా మంగళవారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఆయన చిత్రపటానికి సీఎం జగన్మోహన్ రెడ్డి, మంత్రులు జోగి రమేష్, చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ, విడుదల రజిని తదితరులు నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌తో బీసీ సంక్షేమ శాఖ మంత్రి వేణుగోపాల్ భేటీ అయ్యారు.
అనంతరం మంత్రి వేణుగోపాల కృష్ణ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ జ్యోతిరావు ఫూలేను స్ఫూర్తిగా తీసుకుని మెరుగైన సమాజం కోసం ఆయన ఆశయాల సాధన కోసం పాటుపడాలన్నారు. బీసీల అభ్యున్నతి కోసం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న సీఎం జగన్.. వారి కుల గణనకు సంబంధించి ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారన్నారు.
బీసీల కుల గణనను నిర్వహించేందుకు సిద్ధమవుతున్న ఇతర రాష్ట్రాల్లో అమలు చేస్తున్న విధానాలపై అధ్యయనం చేసేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని సీఎం జగన్ ఆదేశించినట్లుగా మంత్రి వేణుగోపాల కృష్ణ తెలిపారు. రాష్ట్రంలోని బీసీ కేటగిరీలోని 139 కులాలకు మరిన్ని సంక్షేమ ఫలాలు అందించేందుకు బీసీ కులాల గణనను నిర్వహించాలని సీఎం జగన్ నిర్ణయించారని వెల్లడించారు.
ఇక, ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసే ఈ కమిటీ.. ఇప్పటికే బీసీ కుల గణనకు ముందుకొచ్చిన బిహార్, ఒడిశా, పంజాబ్ రాష్ట్రాల్లో అధ్యయనం చేయనుంది. ఈ కమిటీ సమర్పించిన నివేదిక అనంతరం రాష్ట్రంలో బీసీ కుల గణనకు సంబంధించిన మార్గదర్శకాలను ప్రభుత్వం సిద్ధం చేయనుంది.
ఇదిలా ఉంటే.. ఇప్పటికే బీసీ కులానికి జాతీయ జనాభా లెక్కల్లో ప్రత్యేక కాలం పెట్టాలని సీఎం జగన్మోహన్ రెడ్డి గతంలోనే కోరారు. దేశంలో 90 సంవత్సరాల క్రితం నాటి డేటా ఆధారంగానే రిజర్వేషన్లు కొనసాగుతున్నాయి. దీంతో సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు నష్టపోతున్నాయని ఆయా వర్గాలు చెబుతున్నాయి. కులాల లెక్కలతోనే బీసీల అసలు జనాభా తెలుస్తుందని భావిస్తున్నాయి. దేశంలో బీసీల జనాభా 70 కోట్లు అని.. మొత్తం జనాభాలో ఇది 56 శాతం అని పలు బీసీ సంఘాలు చెబుతున్నాయి.
ఈ క్రమంలో కులగణన చేపట్టాలంటూ డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. 12 సంవత్సరాలకు ఓ సారి దేశంలో జనాభాను లెక్కిస్తున్నా.. అందులో దళితులు, ఆదివాసీల సంఖ్యపై మాత్రమే స్పష్టమైన సమాచారాన్ని సేకరిస్తున్నారు. అయితే జనాభాలో ఓబీసీలతో పాటు ఏయే కులాల వారు ఎంత మంది ఉన్నారన్న సమగ్ర సమాచారం సేకరించడం లేదు. ఈ క్రమంలో గతంలో ఇచ్చిన హామీ మేరకు జగన్ సర్కార్ త్వరలోనే బీసీ కుల గణనకు శ్రీకారం చుట్టనుంది.