సర్వేపల్లి నియోజకవర్గంలో అక్రమ కేసులతో టీడీపీ నేతలను ఒక్కరినైనా జైలుకు పంపనిదే, లేదా పోలీసులతో కొట్టించినదే మంత్రి కాకాణికి నిద్రరాదని టీడీపీ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఆరోపించారు. చెముడుగుంట పరిధిలోని జిల్లా కారాగారంలో రిమాండ్‌లో ఉన్న వెంకటాచలం టీడీపీ నేతలు రాజేంద్ర, బాబురావు, ఆశోక్, జగదీష్, మునిచంద్రలను బుధవారం ఆయన పరామర్శించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పలకరించారు. అలాగే జంగాలపల్లికి చెందిన గుమ్మా రాజగోపాల్, రామయ్యలు ఇటీవల జైలు నుంచి విడుదలయ్యారు. వారిని వారి స్వగృహాలకు వెళ్లి పరామర్శించారు. అనంతరం మాట్లాడుతూ సర్వేపల్లి చరిత్రలో తాను ఎన్నడూ కక్షసాధింపు రాజకీయాలు చూడలేదని, ప్రస్తుత వైసీపీ ప్రభుత్వంలోనే చూస్తున్నట్లు చెప్పారు. మంత్రి కాకాణి దుర్మార్గపు పాలనకు ప్రజలే బుద్ధి చెప్పడం ఖాయమన్నారు.