నెల్లూరు బరాషాహిద్ దర్గా అభివృద్ధి, మసీదు నిర్మాణం కోసం రూ.15 కోట్లు నిధులు కేటాయిస్తూ జీవో జారీ చేసి జాప్యం చేసారని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. 9 నెలలు అయినా ఆర్ధిక శాఖ అనుమతులు లేవని నిలిపేశారని... 6 నెలల పాటు ప్రభుత్వం పెద్దల చుట్టు తిరిగినట్లు తెలిపారు. నాలుగు సార్లు టెండర్లు పిలిచినా ఒక్క కాంట్రాక్టర్ కూడా ముందుకు రాలేదన్నారు. వారం రోజుల నుంచి ప్రత్యేక కార్యక్రమం చేపట్టామని తెలిపారు. పవిత్ర రంజాన్ మాసంలో దర్గా కోసం ఉద్యమం చేపడితే నెరవేరుతుందని శ్రీకారం చుట్టామని.. తమ ప్రయత్నంతో విజయం సాధించామన్నారు. రాత్రి దర్గా అభివృద్ధి పనులకు ఆర్ధిక శాఖ అనుమతులు ఇచ్చిందన్నారు. ఇది తన విజయం కాదని నెల్లూరు ముస్లిం సోదరుల పోరాటమని ఎమ్మెల్యే చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా సీఎం జగన్ కు, అలానే వైసీపీ ప్రభుత్వానికి అయన కృతజ్ఞతలు తెలిపారు.