అందరూ ఊహించినట్లుగానే కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలోని ఆరుగొలను జంక్షన్ లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య ఘర్షణ జరగ్గా, పలువురికి గాయాలయ్యాయి. ఓ టీడీపీ కార్యకర్తకు తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. టీడీపీ శ్రేణులపై దాడి ఘటన పట్ల పార్టీ అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా ఎస్పీకి ఫోన్ చేసి ఘటనపై మాట్లాడారు.
కృష్ణా జిల్లాలో పర్యటిస్తున్న చంద్రబాబు రాక కోసం టీడీపీ కార్యకర్తలు నిరీక్షిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. వైసీపీ జెండాతో వచ్చిన ఓ వ్యక్తి అక్కడ హంగామా సృష్టించే ప్రయత్నం చేయగా, పోలీసులు అతడిని పక్కకి తీసుకెళ్లారు. అనంతరం జరిగిన పరిణామాల నేపథ్యంలో, టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ జరిగినట్టు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే టీడీపీ అధినేత చంద్రబాబు హనుమాన్ జంక్షన్ లో కల్యాణి కుటుంబాన్ని పరామర్శించారు. కల్యాణి ఇటీవల అరెస్టయి, ప్రస్తుతం జైలులో ఉన్నారు. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి జరగ్గా, కల్యాణిపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో, కల్యాణి కుటుంబ సభ్యులను కలిసిన చంద్రబాబు, పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.