భారతరత్న రాజ్యాంగ నిర్మాత బి.ఆర్ అంబేద్కర్ ఆశయాలను టిడిపి ముందుకు తీసుకెళ్తుందని ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లా పర్యటనలో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు ఇవాళ గుడివాడలో అంబేద్కర్ జయంతి కార్యక్రమంలో పాల్గొన్నారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కు ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చంద్రబాబు మాట్లాడారు.
సాధారణ కుటుంబంలో పుట్టిన అంబేద్కర్ అసాధారణ శక్తిగా ఎదిగారని కొనియాడారు. దేశ భవిష్యత్తు కోసం బాబా సాహెబ్ అందించిన సేవలు మరువలేనివని, ఆయన ఆశయాలను టీడీపీ ముందుకు తీసుకెళుతుందని తెలిపారు. నాడు నేషనల్ ఫ్రంట్ చైర్మన్ గా ఎన్టీఆర్ ఉన్నప్పుడే అప్పటి కేంద్ర ప్రభుత్వం అంబేద్కర్ కు భారతరత్న ప్రకటించిందని గుర్తు చేశారు. అంబేద్కర్ కు నిజమైన వారసుడు ఎన్టీఆరేనని అన్నారు.
దళిత వర్గానికి చెందిన కేఆర్ నారాయణన్ ను రాష్ట్రపతిగా ప్రతిపాదించి గెలిపించింది టీడీపీయేనని పేర్కొన్నారు. అదే వర్గానికి చెందిన బాలయోగిని లోక్ సభ స్పీకర్ గా చేశామని చంద్రబాబు వెల్లడించారు. కాకి మాధవరావును సీఎస్ చేసిన ఘనత కూడా టీడీపీకే చెందుతుందని వివరించారు. అంటరానితనం నిర్మూలన కోసం జస్టిస్ పున్నయ్య కమిషన్ వేసింది కూడా టీడీపీయేనని, సిఫారసులు కూడా ఆమోదించామని చెప్పుకొచ్చారు. అమరావతిలో భారీ అంబేద్కర్ విగ్రహం, స్మృతివనం ఏర్పాటు చేయాలని నిర్ణయించామని, కానీ వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని చంద్రబాబు ఆరోపించారు.