ఇటీవల కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఏమి చేసిన అది వైరల్ అయిపోతోంది. ఇది ఇలా ఉంటే పరువునష్టం కలిగించే వ్యాఖ్యలు చేశారంటూ దాఖలైన కేసులో దోషిగా తేలి, పార్లమెంటు సభ్యత్వం కోల్పోయిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నేడు తన అధికారిక బంగళా ఖాళీ చేశారు. ఢిల్లీలోని తుగ్లక్ లేన్‌లోగల 12వ నెంబర్ బంగళాలోని ఆయన వస్తువులను తీసుకుని ఓ ట్రక్ వెళ్లిపోతున్న దృశ్యాలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
2004లో లోక్ సభ సభ్యుడిగా గెలుపొందిన రాహుల్ గాంధీకి ఈ బంగళా కేటాయించారు. నాటి నుంచి ఈ భవంతి రాహుల్ అధికారిక నివాసంగా మారింది. అయితే..మోదీ పేరుపై అమర్యాదకర వ్యాఖ్యలు చేసినట్టు 2019లో దాఖలైన పరువు నష్టం కేసులో సూరత్ కోర్టు ఇటీవలే ఆయనను దోషిగా తేల్చింది.
ఈ నేపథ్యంలో నిబంధనలను అనుసరించి రాహుల్ మార్చి 23 నుంచి ఆటోమేటిక్‌గా తన లోక్‌సభ సభ్యత్వాన్ని కోల్పోయినట్టు లోక్‌సభ సెక్రెటరీ ఓ ప్రకటన జారీ చేశారు. ఆ తరువాత ఎంపీగా ఆయనకు కేటాయించిన అధికారిక భవనాన్ని కూడా ఖాళీ చేయాలంటూ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఏప్రిల్ 22 లోపల ఖాళీ చేయాలంటూ డెడ్ లైన్ విధించారు. ఈ క్రమంలోనే రాహుల్ తన బంగళా ఖాళీ చేసినట్టు తెలుస్తోంది.