ప్రియుడు చేసిన తప్పుకు ఓ యువతి బలైంది. అవాంఛిత గర్భాన్ని తొలగించుకునే ప్రయత్నం చేసి తరగతి గదిలోనే మృతి చెందింది. నెల్లూరు జిల్లాలో చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మర్రిపాడు మండలానికి చెందిన ఓ యువతి (19 ఏళ్లు) నెల్లూరు రూరల్ పరిధిలోని ఓ ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ సెకండియర్ చదువుతోంది. ఈ నెల 9న కాలేజ్ విద్యార్థులందరూ క్లాస్ బయట ఉండగా.. యువతి ఒక్కరే గదిలో ఉండి లోపల నుంచి తలుపులకు గడియ పెట్టుకుంది. ఎంతసేపటికీ బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన తోటి స్నేహితులు తలుపులు పగలగొట్టి చూడగా.. తరగతి గదిలో తీవ్ర రక్తస్రావంతో అపస్మారక స్థితిలో పడిఉంది. పక్కనే 6 నెలల పిండం ఉంది.
తోటి విద్యార్థులు హుటాహుటిన ఆమెను, పిండాన్ని సమీపంలోని ఓ ఆసుపత్రికి తరలించారు. ఆమె అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. కాలేజీ సిబ్బంది ద్వారా సమాచారం అందుకున్న నెల్లూరు రూరల్ పోలీసులు ఆస్పత్రికి వచ్చి వివరాలు సేకరించారు. ఉన్నత చదువులు చదువుకొని ప్రయోజకురాలవుతుందని భావించిన కుమార్తె.. అకస్మాత్తుగా విగతజీవిగా కనిపించడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా రోదించారు. యువతి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. బాధిత విద్యార్థిని తరగతి గదిలోనే ఎవరి సాయంతోనైనా అబార్షన్ చేసుకుందా? లేదా యూట్యూబ్ వీడియోలు చూపి తనకు తానే అబార్షన్ చేసుకుందా? అనేది పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది. యువతి సెల్‌ఫోన్ డేటాను పరిశీలించిన పోలీసులు.. అనంతసాగరానికి చెందిన ఓ కారు డ్రైవరుతో ఆమెకు పరిచయం ఉన్నట్లు గుర్తించారు. ఆ యువకుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు తెలుస్తోంది. దర్యాప్తు కొనసాగుతోందని నెల్లూరు రూరల్ సీఐ శ్రీనివాసులురెడ్డి తెలిపారు.