తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన శనివారం జరిగిన పాలకమండలి సమావేశం ముగిసింది. ఈ క్రమంలో టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ వివరాలను టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మీడియాకు వెల్లడించారు. తిరుమల శ్రీవారి నైవేద్యానికి సేంద్రీయ వ్యవసాయ ఉత్పత్తులు వినియోగించాలని టీటీడీ పాలక మండలి నిర్ణయించినట్లు తెలిపారు. అన్నప్రసాదంతో పాటు లడ్డూ ప్రసాదానికి కూడా సేంద్రీయ వ్యవసాయ ఉత్పత్తులు మాత్రమే వినియోగించనున్నట్లు పేర్కొన్నారు. అలాగే సేంద్రీయ వ్యవసాయ ఉత్పత్తుల ధరల నిర్ణయానికి కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.
అమెజాన్‌లో ఏప్రిల్ 14 నుంచి17వ తేదీ వరకు బ్లాక్ బస్టర్ వేల్యూ డేస్ | కిచెన్, సమ్మర్, గృహోపకరణాలపై భారీ తగ్గింపు ధరలు
ఇక, దాతలు అందించిన రూ. 10 లక్షల వ్యయంతో బేడి ఆంజనేయ స్వామి ఆలయానికి వెండి కవచాలు ఏర్పాటు చేయనున్నట్లు వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. అలాగే పద్మావతి మెడికల్ కాలేజీలో టీబీ విభాగం ఏర్పాటుకు రూ. 53.62 కోట్లు కేటాయిస్తున్నట్లు పేర్కొన్నారు. అలిపిరి వద్ద గోడౌన్ల నిర్మాణానికి రూ. 18 కోట్లు, కోల్డ్ స్టోరేజీ నిర్మాణానికి రూ. 14 కోట్లు కేటాయించినట్లు వివరించారు. ఢిల్లీలోని ఆడిటోరియం అభివృద్ధి పనులకు రూ. 4 కోట్లు కేటాయించినట్లు పేర్కొన్నారు. టీటీడీ విద్యా సంస్థల్లో భోదనా సిబ్బంది నియామకానికి పాలకమండలి అంగీకారం తెలిపిందన్నారు.
ఇక, ఢిల్లీలోని శ్రీవేంకటేశ్వర ఆలయంలో మే 3 నుంచి 13వ వరకు బ్రహ్మోత్సవాలు నిర్వహించాలని నిర్ణయించినట్లు వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ ఆలయ అభివృద్ది పనులకు రూ.3.12 కోట్లు కేటాయించిందనట్లు పేర్కొన్నారు. జూన్ 15 కల్లా శ్రీనివాస సేతు పనులు పూర్తి చేసి భక్తులకు అందుబాటులోకి తీసుకొస్తామని సమావేశంలో వెల్లడించారు. అలాగే, విదేశీ కరెన్సీ మార్పిడిపై కేంద్రం విధించిన రూ. 3 కోట్ల జరుమానాను రద్దు చేయాలని హోం శాఖ దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించినట్లు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. మరోవైపు ఒంటిమిట్ట కోదండ రామాలయంలో బ్రహ్మోత్సవాలు, కళ్యాణం విజయవంతంగా జరిగాయని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. బ్రహ్మోత్సవాలను విజయవంతం చేసిన అందరికీ అభినందనలు తెలిపారు.