శ్రీశైల మహాక్షేత్రంలో అర్ధరాత్రి డ్రోన్ కలకలంరేపింది. ఆర్టీసీ బస్టాండ్, కమ్మ సత్రం, బలిజ సత్రం ఆలయ పరిసరాలలో ఆకాశంలో డ్రోన్ చక్కర్లు కొట్టింది. స్థానికులు డ్రోన్‌ను గమనించి దేవస్థానం అధికారులకు సమాచారం ఇచ్చారు. వెంటనే సెక్యూరిటీ సిబ్బంది ఈ డ్రోన్‌ను పట్టుకునేందుకు తెల్లవారు జామువరకు ప్రయత్నాలు చేశారు. అప్పటి వరకు ఆకాశంలో ఎగిరిన డ్రోన్ దూరంగా వెళ్లిపోయింది. డ్రోన్‌ను ఎగరేసిన వారికోసం సెక్యూరిటీ సిబ్బంది గాలిస్తోంది. దేవస్థానం అధికారుల అనుమతి లేకుండా ఆకాశంలో డ్రోన్ ఎగిరింది.
అంతేకాదు 2021 డిసెంబర్‌లో కూడా శ్రీశైలం మహాక్షేత్రంలో డ్రోన్ ఎగిరింది. ఆలయం పక్కన పుష్కరిణి దగ్గర భక్తులు డ్రోన్‌ను గుర్తించగా.. సెక్యూరిటీ సిబ్బంది రంగంలోకి దిగింది. డ్రోన్ కోసం గాలించగా.. ఆ చుట్టుపక్కల ఇద్దరు వ్యక్తులు కనిపించారు.. వారి నుంచి డ్రోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. వారిని సెక్యూరిటీ సిబ్బంది ప్రశ్నిస్తే పొంతనలేకుండా మాట్లాడారు. ఇద్దర్ని పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు.
2021 జులైలో కూడా శ్రీశైలంలో డ్రోన్ ప్రత్యక్షమైంది. అప్పుడు కూడా అర్ధరాత్రి సమయంలో డ్రోన్ కనిపించింది. సెక్యూరిటీ సిబ్బంది పట్టుకునేందుకు ప్రయత్నించినా దొరకలేదు. డ్రోన్ వ్యవహారంపై ఏకంగా జిల్లా ఎస్పీ రంగంలోకి దిగారు.. స్పెషల్ టీమ్‌లతో గాలించినా డ్రోన్ జాడ దొరకలేదు. మళ్లీ ఇప్పుడు డ్రోన్ చక్కర్లు కొట్టడం కలకలంరేపుతోంది.