ఏపీలో వైసీపీ వర్సెస్ టీడీపీ అన్నట్లుగా వార్ మమ్మురంగా కొనసాగుతోంది. ఇదిలావుంేట టీడీపీ అధినత చంద్రబాబు పర్యటన వేళ హనుమాన్ జంక్షన్ దగ్గర ప్లెక్సీల కలకలంరేపాయి. గన్నవరం నియోజకవర్గంలో కీలక సమస్యలను ఎత్తిచూపుతూ, చంద్రబాబుని విమర్శిస్తూ ఫ్లెక్సీలు వెలశాయి. డెల్టా షుగర్ ప్యాక్టరీని మూసివేయడం, మల్లవల్లి ఏపీఐఐసీ, గన్నవరం విమానాశ్రయ విస్తరణకు భూములు తీసుకుని అర్హులైన వారికి పరిహారం ఇవ్వలేదని ఆరోపించారు. విజయవాడ ఇన్నర్ రింగురోడ్డు నిర్మాణంలో ఓ రౌడీ షీటరు హోటల్ కూల్చకుండా రామవరప్పాడు కాల్వగట్లపై పేదల ఇళ్లు కూల్చారన్నారు.
అలాగే హుదూద్ బాధితుల సాయం కోసం 50 లక్షలు విరాళంగా సేకరించి లోకేష్‌కు ఇస్తే మాయం చేశారని.. పోలవరం కాల్వ, బ్రహ్మ లింగం చెరువు అభివృద్ది అంటూ సామంత మంత్రితో మట్టి దోపిడీ చేసినందుకు.. లక్ష ఇళ్ల పట్టాలంటూ పేదలకు స్థలాలు ఇవ్వకుండా మోసం చేసినందుకు స్వాగతం పలకాల అంటూ ప్రశ్నించారు. చంద్రబాబు వచ్చే దారిలో పలుచోట్ల ఈ ప్లెక్సీలు కట్టారు.. ఇదేమీఖర్మ చంద్రబాబు, బైబై బాబూ అంటూ ఎద్దేవా చేశారు. ఇదిలా ఉంటే చంద్రబాబు నూజివీడు పర్యటనలో అపశృతి చోటు చేసుకుంది. ట్రాక్టర్లలో తీసుకొచ్చిన మహిళలకు విద్యుత్ షాక్ తగిలింది. చంద్రబాబు వేదిక వద్దకు రాగానే ఇనుప పైపులకు తొడిగిన జెండాలను పైకి ఎత్తమని టీడీపీ నేతలు కోరారు.
ఈ క్రమంలో జెండాలను మహిళలు పైకి ఎత్తగానే విద్యుత్ తీగలు తగిలాయి. ఈ ఘటనలో 9మంది మహిళలకు స్వల్ప గాయాలయ్యాయి
మరో మహిళకు తీవ్ర గాయాలు కాగా.. వీరందర్ని నూజివీడు ఆసుపత్రికి తరలించారు. నూజివీడు మండలం శీతారాం పురం గ్రామం నుండి ట్రాక్టర్ లో 30 మంది మహిళలు వచ్చారు.. వీరికి డబ్బుల ఇచ్చి సమావేశానికి తీసుకొచ్చారని చెబుతున్నారు.
మరోవైపు నూజివీడులో ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. రాష్ట్రంలో ఒక్క వర్గం కూడా ఆనందంగా లేరని.. అన్నింటిలో బాదుడే బాదుడు అంటూ విమర్శించారు. మళ్లీ ఇప్పుడు కరెంట్ చార్జీలు పెంచుతున్నాని.. భవిష్యత్ లో కరెంట్ చార్జీలుపెంచాల్సిన అవసరం లేదని తాను చెప్పానన్నారు. 8 సార్లు కరెంట్ చార్జీలు పెంచారు.. ఆర్టీసీ చార్జీలు పెంచారు.. ఇచ్చింది 10 రూపాయలు.. దోచింది 100 రూపాయలు అన్నారు. జగన్ బటన్ నొక్కుడు కాదు.. బటన్ బొక్కుడు అంటూ ఎద్దేవా చేశారు. బటన్ నొక్కుడు గొప్ప కాదు.. సంపద సృష్టించే శక్తి ఉండాలన్నారు.
తోపుడు బండి దగ్గర కూడా గూగుల్ పే నుంచి పే చెయ్యవచ్చు.. కానీ మద్యం షాపులో మాత్రం ఆన్ లైన్ లో పేమెంట్ లేదన్నారు. రాష్ట్రంలో ఇసుక దొరకడం లేదు. కానీ ఇక్కడ ఎమ్మెల్యే మాత్రం ఇసుక తరలిస్తున్నారన్నారు. బటన్ బొక్కుడు ద్వారా జగన్ రెడ్డి ఆదాయం రూ. 2 లక్షల కోట్లు.. జనాలపై పన్నుల భారం రూ 5 లక్షల కోట్లని ధ్వజమెత్తారు. పిల్లలపై అప్పుల భారం రూ.10 లక్షల కోట్లు.. అంటే ఒక్కో వ్యక్తిపై రెండు లక్షల అప్పు ఉందన్నారు. నిన్ననే కోడికత్తి డ్రామా బట్టబయలు అయ్యిందని.. డ్రామా అని తాను గతంలోనే చెప్పానన్నారు.
జగన్ ను ప్రశ్నిస్తే కేసు పెడతారని.. భయపడి ఎవరూ ప్రశ్నించకపోతే ఎలా అన్నారు. ఇన్ని కేసులు పెట్టినా తెలుగు దేశం పోరాడింది.. ఇప్పుడు జనం కూడా బయటకు వస్తున్నారన్నారు. ఎన్ని రోజులు నిద్ర లేని రాత్రులు గడిపానని.. పార్టీ నేతలను అరెస్టు చేస్తుంటే చాలా వేదన చెందాను అన్నారు. గన్నవరంలో ఒక ఆడబిడ్డను.. కనీసం బట్టలు కూడా మార్చుకోనివ్వకుండా అరెస్టు చేశారన్నారు. తాను పోలీసులు అందరినీ అనడం లేదు.. తప్పు చేసిన అధికారులను మాత్రం వదిలేది లేదన్నారు. ఏపీని ఈ రోజు వేరే రాష్ట్రాల వారు ఎగతాళి చేసే పరిస్థితి వచ్చిందన్నారు.