విజయవాడలో నూతనంగా ఒలింపిక్ భవన్‌ను నిర్మించడానికి తగుచర్యలు తీసుకుంటామని ఏపీ ఒలింపిక్ అసోసియేషన్ (రిజిస్టర్ నెం:175/1961) జనరల్ సెక్రటరీ కేపీ రావు, అధ్యక్షుడు డి.నాగేశ్వరరావులు వెల్లడించారు. విజయవాడ నగరంలోని ఇందిరాగాంధీ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియంలో ఏపీ ఒలింపిక్ అసోసియేషన్ వార్షిక జనరల్ బాడీ సమావేశం ఆదివారం జరిగింది. సమావేశంలో పలు తీర్మానాలను వారు విలేకరుల సమావేశంలో వివరించారు. ఐవోఏ గుర్తింపు పొందిన 36 సంఘాల్లోని 26 నేషనల్ ఫెడరేషన్ గుర్తింపు పొందిన ప్రతి నిధులతో సమావేశం నిర్వహించామన్నారు. హైదరాబాద్‌లోని ఒలింపిక్ అసోసియేషన్‌కు సంబంధించి విభజన చట్టం ప్రకారం 58శాతం ఏపీకి, 42 శాతం తెలంగాణకు డిపాజిట్లు దక్కుతాయని, ఒలింపిక్ భవన్‌ను వారికి వదిలేసి, కోటి రూపాయలతో విజయవాడలో నూతన భవనాన్ని నిర్మిస్తామన్నారు.