బీజేపీలో చేరుతున్నట్టు వస్తున్న కథనాలను నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నేత అజిత్ పవార్ఖండించారు. ఎటువంటి కారణం లేకుండా మీడియా తప్పుడు ప్రచారం చేస్తోందని మాజీ డిప్యూటీ సీఎం మండిపడ్డారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘తాను బీజేపీలోకి వెళ్తున్నట్టు జరుగుతోన్న ప్రచారంలో నిజం లేదు.. నేను ఎన్సీపీతోనే ఉన్నాను.. అందులోనే ఉంటాను’ అని స్పష్టం చేశారు. మహారాష్ట్ర ప్రతిపక్షం, ఎన్సీపీలో చీలిక వచ్చిందని చేస్తున్న ప్రచారంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘తప్పుడు ప్రచారంతో ఎన్సీపీ కార్యకర్తలు గందరగోళానికి గురవుతున్నారు.. ఆందోళన చెందొద్దని నేను వారికి చెబుతున్నాను.. శరద్ పవార్ నాయకత్వంలో ఎన్సీపీ ఏర్పాటయ్యింది.. మేము అధికారంలో లేదా ప్రతిపక్షంలో ఉన్న సందర్భాలు ఉన్నాయి’’ అని అజిత్ పవార్ ఉద్ఘాటించారు. మంగళవారం అజిత్ పవార్ ముంబయిలో ఎమ్మెల్యేల సమావేశం ఏర్పాటు చేస్తున్నారని, 30 నుంచి 34 మంది ఎన్సీపీ ఎమ్మెల్యేలు ఆయనతో కలిసి బీజేపీ తీర్థం తీసుకోనున్నారని ప్రచారం జరిగింది. దీనిని ఎన్‌సీపీ చీఫ్ శరద్ పవార్ సైతం తోసిపుచ్చారు.
‘ఆ వార్తలో నిజం లేదని, అజిత్ పవార్ ఎటువంటి సమావేశానికి పిలుపునివ్వలేదు. ఆయన పార్టీ కోసం పనిచేస్తున్నారు.. అందరూ దీనిని గమనించాలి’ అని పవార్ సమాధానం ఇచ్చారు. మరోవైపు, అజిత్ పవార్ బీజేపీలో చేరనున్నారనే ఊహాగానాలమ ధ్య మంగళవారం ఉదయం శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలే మీడియాతో మాట్లాడుతూ.. మరో 15 రోజుల్లో ఒకటి ఢిల్లీ, మరొకటి మహారాష్ట్రలో రెండు భారీ రాజకీయ విస్ఫోటనాలు సంభవించబోతున్నాయని అన్నారు. ఆ విస్ఫోటనాలు ఏంటని ప్రశ్నించగా.. మీరే చూస్తారు అని తెలివిగా సమాధానం ఇచ్చారు.
‘ఆ విస్ఫోటనం ఏంటో మీకు తెలుసు.. నేను నేను వాస్తవంలో జీవిస్తున్నాను. ఈరోజు గురించి అడిగితే చెప్పగలను. 15 రోజుల తర్వాత ఏం జరుగుతుందో తెలియదు’ అని అన్నారు. అంతేకాదు, ‘అజిత్ దాదా గురించి తనను ఎందుకు అడుగుతారని.. దీనిని గురించి నాకేమీ తెలియదు.. ఓ ప్రజాప్రతినిధిగా నాకు చాలా పనులు ఉంటాయి.. గాసిప్స్ గురించి వినే సమయం లేదు’ అని వ్యాఖ్యానించారు.