ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నాణ్యమైన బియ్యం కొనుగోలుకు...రైస్ మిల్లర్ల అసోసియేషన్‌తో సమావేశం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Apr 19, 2023, 08:55 PM

 తిరుమల శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులకు మరింత నాణ్యమైన, రుచికరమైన అన్న ప్రసాదాలు అందించడానికి టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై మిల్లర్ల నుంచి నేరుగా బియ్యం కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నట్లు టీటీడీ ఈవో ధర్మారెడ్డి చెప్పారు. తిరుపతి శ్రీ పద్మావతి గెస్ట్ హౌస్‌లో ఈవో, ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లోని రైస్ మిల్లర్ల అసోసియేషన్ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. టీటీడీ అన్నప్రసాదాలకు, ఇతర అవసరాలకు 2013 నుంచి 2019 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రైస్ మిల్లర్స్ అసోసియేషన్ నుండి నాణ్యమైన సోనా మసూర బియ్యం కొనుగోలు చేసినట్లు తెలిపారు ఈవో. 2019లో పాలకమండలి నిర్ణయం మేరకు టెండర్ ద్వారా బియ్యం కొనుగోలు చేయాలని నిర్ణయించారన్నారు. టెండర్ ప్రక్రియ ద్వారా బియ్యం కొనుగోలు చేయడం వల్ల వ్యాపారస్తులు, మిల్లర్ల వద్ద కొని టీటీడీకి సరఫరా చేస్తున్నారన్నారు. టీటీడీ నేరుగా రైస్ మిల్లర్ల వద్ద కొనుగోలు చేయడం వలన మరింత నాణ్యమైన బియ్యం అందుతాయని ఆయన చెప్పారు.


టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఆదేశాల మేరకు అన్న ప్రసాదాలను మరింత రుచికరంగా అందించేందుకు తెలుగు రాష్ట్రాల్లోని రైస్ మిల్లర్లతో సమావేశం నిర్వహించినట్లు తెలిపారు. ఈ సమావేశంలో పాల్గొన్న మిల్లర్లు వారం రోజుల్లో బియ్యం సరఫరా రేటు తెలియజేస్తామని చెప్పినట్లు తెలిపారు. ఇటీవల టీటీడీ అన్నప్రసాదంలో బియ్యం బాగాలేవని భక్తుల నుండి ఫిర్యాదులు అందాయన్నారు. ప్రస్తుతం టెండర్ ద్వారా వ్యాపారస్తులు రూ.38 రూపాయలకు కేజి బియ్యం అందిస్తున్నారని ఈవో వివరించారు. గో ఆధారిత వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేసేందుకు రైతు సాధికార సంస్థ, ఏపి మార్క్ ఫెడ్లతో ఒప్పందం చేసుకున్నట్లు ఆయన తెలిపారు.


టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న మ్యాన్ స్క్రిప్ట్స్ ప్రాజెక్టులో స్కాన్ చేసిన తాళపత్ర గ్రంథాలు 500 ఏళ్ళు గడచినా చెక్కుచెదరని విధంగా భద్రపరచాలని టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి చెప్పారు. ఇందుకు అవసరమైన అధునాతన సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించాలని అధికారులకు ఆయన సూచించారు. మ్యాన్ స్క్రిప్ట్ ప్రాజెక్టు ప్రగతిపై సోమవారం శ్రీ వేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయంలో ఆయన సమీక్ష నిర్వహించారు. నెలరోజులుగా జరిగిన ప్రాజెక్టు ప్రగతిపై అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.


వేద విశ్వవిద్యాలయంలో నడుస్తున్న మ్యాన్ స్క్రిప్ట్ ప్రాజెక్టుకు జాతీయ మ్యాన్ స్క్రిప్ట్ మిషన్ తో అవగాహన ఉందన్నారు ఈవో ధర్మారెడ్డి. తాళపత్ర గ్రంధాలను భద్రపరచడం, గ్రంథీ కరణ చేయడం లాంటి పనుల్లో వారి సహకారం తీసుకోవాలని చెప్పారు.


పురావస్తు శాఖ, ఎస్వీ యూనివర్సిటీ, జాతీయ సంస్కృత యూనివర్సిటీ నుండి తెచ్చిన వేలాది తాళపత్ర గ్రంథాలను స్కాన్ చేసి వాటిని స్కాలర్స్ ద్వారా గ్రంథీకరణ చేయాలన్నారు. ఇందులో సమాజానికి బాగా ఉపయోగపడే వాటిని ఎంపిక చేసి పుస్తకరూపంలో అందుబాటులోకి తేవాలని ఈవో సూచించారు. తాళపత్ర గ్రంథాలకు సంబంధించిన వివరణాత్మక క్యాటలాగ్స్ తయారు చేయాలని ఆయన చెప్పారు. స్కాన్ చేసిన తాళపత్రాలన్నీ సర్వర్ లో నిక్షిప్తం చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. తాళపత్ర గ్రంథాలను భద్రపరచడానికి సనాతన జీవన ట్రస్ట్ ఆర్ధిక సహకారంతో వేదవిశ్వవిద్యాలయంలో ఒక భవనం నిర్మించేలా ఏర్పాటు చేయాలన్నారు. వేద విశ్వవిద్యాలయం ఉపకులపతి ఇకపై ఈ ప్రాజెక్టుకు డైరెక్టరుగా వ్యవహరిస్తారని ఈవో చెప్పారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com