రాష్ట్రవ్యాప్తంగా మసీదుల్లో పనిచేస్తున్న ఇమామ్‌లు, మౌజన్‌లకు ఈ ఏడాది జనవరి నుంచి గౌరవ వేతనం అందడం లేదు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఇమామ్‌కు నెలకు రూ.5 వేలు, మౌజన్‌కు రూ.3 వేలు గౌరవ వేతనంగా ఇచ్చేవారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నిధుల కొరత పేరుతో మూడు, నాలుగు నెలలకోసారి గౌరవ వేతనాలు విడుదల చేస్తున్నారు. 2021 మేలో వీరి గౌరవ వేతనాలు పెంచి ఇమామ్‌కు రూ.10 వేలు, మౌజన్‌కు రూ.5వేలు ఇస్తున్నారు. అయితే, నెలనెలా గౌరవ వేతనం ఇచ్చే ప్రక్రియ అటకెక్కింది. నిధులు అందుబాటులోకి వచ్చినప్పుడు మూడు, నాలుగు నెలలకోసారి విడుదల చేస్తున్నారు. రంజాన్ నెలలో తప్పకుండా గౌరవ వేతనాలు అందుతాయని భావించిన ఇమామ్, మౌజన్‌కు నిరాశే మిగిలింది. మరో మూడు రోజుల్లో(ఈనెల 22న) రంజాన్ పండుగను జరుపుకోనున్నారు. గత మూడు నెలలుగా రావాల్సిన గౌరవ వేతనం వస్తే పండుగను ఘనంగా జరుపుకోవచ్చని వారంతా భావించారు. పండుగ దగ్గర పడినా గౌరవ వేతన బకాయిలు పడకపోవడంతో వారంతా నిరాశకు లోనవుతున్నారు. మరోవైపు హజ్ కమిటీ, వక్ఫ్ బోర్డు, ముస్లిం మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్, ఉర్దు అకాడమీలో పనిచేసే ఉద్యోగులకు మార్చి జీతాలు ఇంకా అందలేదు. రంజాన్ పండుగను పురస్కరించుకుని గౌరవ వేతనాలు, జీతాలు వెంటనే విడుదల చేయాలని వారంతా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. గౌరవ వేతనం అందుకునే ఇమామ్, మౌజన్‌లు రాష్ట్రంలో సుమారు 10వేల మంది ఉన్నారు.