కేంద్రంపై పోరాటం ఉధృతం చేసే కార్యాచరణలో భాగంగా మే 3వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా రాస్తారోకోలు నిర్వహించి కేంద్రానికి నిరసన తెలియజేయాలని వివిధ రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాల నేతలు పిలుపునిచ్చారు. విశాఖ ఉక్కు పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో బుధవారం విజయవాడలోని బాలోత్సవ్ భవన్‌లో ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.ఓబులేసు అధ్యక్షతన రౌండ్‌టేబుల్ సమావేశం జరిగింది. కేంద్రంపై ఒత్తిడి తెచ్చే పోరాటంలో రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలు భాగస్వాములు కావాలని సమావేశంలో తీర్మానించారు. ఈ సందర్భంగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ మాట్లాడుతూ.. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ, పోలవరం ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి కేంద్ర పెద్దలతో మాట్లాడాలన్నారు. జగన్ ఢిల్లీ వెళితే ఈసారి అఖిలపక్ష నాయకుల్ని తీసుకువెళ్లాలని డిమాండ్ చేశారు. మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ గతంలో అనేకమార్లు కేంద్రం విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు చూస్తే నాటి ప్రభుత్వాలు అడ్డుకున్నాయని, ఇప్పటి వైసీపీ ప్రభుత్వం కనీసం బాధ్యత కూడా తీసుకోవడం లేదన్నారు.