రాష్ట్రంలో కరోనా కేసులు పెరిగే అవకాశాలు ఉన్నాయని వైద్య వర్గాలనుండి సమాచారం. దానికి కారణం పలు చోట్ల కేసులు నమోదు కావడమే. వివరాల్లోకి వెళ్ళితే..... విశాఖ నగరంలో కొవిడ్ లక్షణాలతో ఆస్పత్రిలో చేరిన ఓ యువకుడు (21) మృతిచెందాడు. గుంటూరు జిల్లా తెనాలిలోనూ ఇద్దరు విద్యార్థులకు పాజిటివ్ నిర్ధారణ అయింది. వివరాలు... విశాఖ నగరం మాధవధారలోని లవ్ అండ్ కేర్ చిల్డ్రన్ వెల్ఫేర్ సొసైటీ ఎన్‌జీవో హోంలో ఉంటున్న 21 ఏళ్ల యువకుడు సెరిబ్రల్ పాల్సీతో బాధపడుతున్నాడు. నాలుగు రోజుల క్రితం జ్వరం రావడంతో ఆరోగ్య సిబ్బంది ఆ యువకుడికి ర్యాపిడ్ యాంటీజెన్ పరీక్ష నిర్వహించారు. అందులో పాజిటివ్ రావడంతో 17న అతన్ని కేజీహెచ్‌లోని ఐసోలేషన్ వార్డులో చేర్పించారు. మంగళవారం తెల్లవారుజామున ఆ వ్యక్తి మరణించాడు. ర్యాపిడ్ యాంటీజెన్‌లో పాజిటివ్ వచ్చిన వారికి ఆర్‌పీసీఆర్ నిర్వహిస్తామని, ఈ పరీక్షలో ఆ అతనికి నెగిటివ్ వచ్చిందని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి జగదీశ్వరరావు తెలిపారు. ఆ యువకుడు లంగ్ ఇన్ఫెక్షన్, న్యుమోనియాతో మృతి చెందినట్టు వెల్లడించారు. కాగా, ఆ హోంలోని పదేళ్ల బాలికకు జ్వరంగా ఉండటంతో ర్యాపిడ్ యాంటీజెన్ పరీక్ష నిర్వహించగా పాజిటివ్ వచ్చింది. సదరు చిన్నారిని కేజీహెచ్‌కు తరలించారు. కాగా, గుంటూరు జిల్లా తెనాలి మండలం అంగలకుదురు గ్రామంలో కరోనా కలకలం రేపింది. గ్రామంలోని ఓ సంస్థ నిర్వహిస్తున్న హాస్టల్‌లో విద్యార్థులకు కరోనా లక్షణాలు కనిపించడంతో యాంటిజెన్ పరీక్షలు నిర్వహించగా ఇద్దరు విద్యార్థులకు పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో వారిని తెనాలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. వారిలో ఒకరు చికిత్స పొందుతుండగా మరొకరిని డిశ్చార్జి చేశారు. చికిత్స పొందుతున్న విద్యార్థికి కూడా ప్రమాదమేమీ లేదని స్వల్ప జ్వరంతో బాధపడుతున్నాడని వైద్యులు తెలిపారు.