పాణ్యం మండలంలోని కౌలూరు గ్రామంలో బుధవారం తెల్లవారుజామున నాలుగు ఇళ్లలో గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. రెండు ఇళ్ల తాళాలు పగులగొట్టి 8 తులాల బంగారు, 18 తులాల వెండి నగలు ఎత్తుకెళ్లారు. సమాచారం తెలిసిన వెంటనే పాణ్యం ఎస్‌ఐ సుధాకరరెడ్డి సిబ్బందితో ఘటనా స్థలాలను పరిశీలించారు. ఇంటికి తాళం వేసి పక్క ఇంటిలో నిద్రించామని, ఉదయం ఇంటి వద్దకు వెళ్లగా తాళం పగులగొట్టి ఇంటిలోని బీరువాను పగులగొట్టి 8 తులాల వెండి నగలు, ఆరున్నర తులాల బంగారు నగలు దోచుకెళ్లారని బాధితురాలు జ్యోతి, రెండు తులాల బంగారం ఎత్తుకెళ్లారని ఎల్లమ్మ తెలిపారు. అలాగే చెట్ల నరసమ్మ ఇంట్లో బీరువా తాళం పగులగొట్టి 10 తులాల వెండి నగలు, అర తులం బంగారు నగలు ఎత్తుకెళ్లారు. ఎరమల మద్దిలేటి ఇంటిలో చొరబడిన దుండగులు బీరువా తాళం పగులగొట్టి బీరువాలో ఏమీ లేకపోవడంతో వెనుదిరిగారు. మూలింటి నాగేశ్వరరావు ఇంటి తాళాలు తెరుస్తుండగా మెలకువ వచ్చి గట్టిగా అరవడంతో దొంగలు పారిపోయారు. గ్రామంలో 35 యేళ్ల క్రితం ఇలాగే దొంగతనం జరిగిందని స్థానికులు పోలీసులకు తెలిపారు. ఈ మేరకు నంద్యాల నుంచి క్లూస్‌టీం ఘటనా స్థలంను పరిశీలించి వేలిముద్రలు, తదితర వివరాలు సేకరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.