సముద్రంలో చేపల వేట నిషేధ కాలం 61 రోజులు వేటకు వెళ్లకుండా సహకరించాలని మత్స్యకారులను అవనిగడ్డ మత్స్యశాఖాభివృద్ధి అధికారి వానపల్లి సత్యనారాయణ కోరారు. గురువారం అవని గడ్డ ప్రాంతీయ మత్స్య అభివృద్ధి కార్యాలయంలో చేపల వేట నిషేధ చట్టం అమలుపై నిర్వహించిన అవగాహన కార్య క్రమంలో ఆయన మాట్లాడారు. నిషేధ చట్టాన్ని అతిక్రమించిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అర్హులైన మత్స్యకారులందరికీ మత్స్యకార భరోసా పథకం వర్తింపజేస్తామన్నారు. జిల్లా మత్స్యకారుల సహ కార సంఘం మాజీ ఉపాధ్యక్షులు లకనం నాగాంజనేయులు మాట్లాడుతూ బ్యాంక్ ఖాతాలను నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో లింక్ చేసుకోవాలని మత్స్యకారులను కోరారు. కర్రి కృష్ణమూర్తి, కోలా హరికృష్ణ, మత్స్య కార సహకార సంఘాల అధ్యక్షులు, విలేజ్ ఫిషరీష్ అధికారులు పాల్గొన్నారు.