కడప జిల్లా కమలాపురం ఎమ్మెల్యే, రవీంద్రనాథరెడ్డి ఆధ్వర్యంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని గురువారం కమలాపురం మండలం దేవరాజుపల్లెలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి పాల్గొంటున్న విషయం తెలుసుకున్న టీడీపీ అభిమానులు నివాసాలపై టీడీపీ జెండాలు కట్టి, ఇళ్లకు తాళాలు వేసుకుని బయటకు వెళ్లిపోయారు. టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పుత్తా నరసింహారెడ్డి స్వగ్రామమైన మాచిరెడ్డిపల్లెకు ఈ గ్రామం కూతవేటు దూరంలో ఉంది. ఇక్కడ మొత్తం మూడు కాలనీలు ఉన్నాయి. ఈ మూడు కాలనీల్లో సుమారు 1,600 ఓట్లు ఉన్నాయి. వీరిలో చాలామంది ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి రాకను వ్యతిరేకిస్తూ బయటకు వెళ్లిపోయారు. పుత్తా స్వగ్రామానికి అత్యంత సమీపంలోని ఊరు కావడంతో గొడవలు జరుగుతాయేమోనన్న అనుమానంతో కమలాపురం, వీఎన్పల్లె, వల్లూరు ఎస్ఐలు భద్రతా చర్యలు చేపట్టారు.