ఏడాది క్రితం ఆ జంటకు వివాహమైంది.. కాపురం సాఫీగా సాగిపోతోంది.. భార్య ఏడు నెలల గర్భిణి. ఇంతలో ఆమె అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరింది.. ఇంతలో ప్రాణాలు విడిచింది. భార్య మరణాన్ని భర్త తట్టుకోలేకపోయాడు.. నువ్వు లేక నేను లేను అనుకున్నాడో ఏమో.. ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. శ్రీకాకుళం జిల్లాలో జరిగిన ఈ ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది.ఆమదాలవలస మండలం ఈసర్లపేటకు చెందిన మంగరాజు రాజబాబుకి ఆర్మీలో ఉద్యోగం వచ్చింది. 2016 నుంచి ఉద్యోగం చేస్తుండగా.. 2022 ఫిబ్రవరిలో అదే గ్రామానికి చెందిన మౌనికతో వివాహమైంది. రాజబాబు ప్రస్తుతం హర్యానాలో విధులు నిర్వర్తిస్తున్నాడు. మౌనిక కూడా ఏడు నెలల గర్భిణి. ఆమె అనారోగ్యంతో బాధపడుతుండగా.. రాజబాబు తండ్రి విశాఖపట్నంలోని ఆర్మీ ఆసుపత్రిలో చేర్పించాడు. కుమారుడికి తండ్రి సత్యనారాయణ సమాచారం ఇచ్చాడు.
రాజబాబు సెలవులు పెట్టి హర్యానా నుంచి వచ్చాడు.. ఈ క్రమంలో ఈనెల 16న మౌని ప్రాణాలు కోల్పోయింది. భార్య మరణంతో రాజబాబు తీవ్ర విషాదంలో ఉన్నాడు. అప్పటి నుంచి భోజనం చేయకపోవడంతో అస్వస్థతకు గురయ్యాడు. భార్య మరణాన్ని భరించలేకపోయాడు.. రాజబాబు బాగా కుంగిపోయాడు. ఈ క్రమంలో రాజబాబు ఈనెల 19న ఆరోగ్యం బాగాలేదని.. ఆస్పత్రికి వెళ్తానని ఇంట్లో చెప్పాడు. ఆముదాలవలస వెళ్లి అక్కడి నుంచి రైలెక్కి పొందూరు చేరుకున్నాడు.
ఆ వెంటనే స్నేహితులకు ఓ మెసేజ్ చేశాడు. తాను పొందూరులో ఉన్నానని.. చనిపోతున్నానని చెప్పడంతో ఫ్రెండ్స్ అంతా షాకయ్యారు. వెంటనే పొందూరు పోలీసులకు సమాచారం అందించారు.. అందరూ కలిసి పొందూరు చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికారు. చివరికి కొంచాడ దగ్గర ఓ తోటలో ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. స్థానికలు ఇచ్చిన సమాచారంతో అక్కడికి వెళ్లి రాజబాబుగా గుర్తించారు. అటు కోడలు, ఇటు కోడుకు మరణంతో తల్లిదండ్రులు కన్నీళ్లు పెట్టుకున్నారు. నాలుగు రోజుల వ్యవధిలోనే భార్తభర్తల మరణంతో గ్రామంలో విషాదచాయలు అలముకున్నాయి.