ఏపీకి చెందిన ఓ ఎమ్మెల్సీ టీటీడీ విజిలెన్స్ అధికారులకు అడ్డంగా దొరికిపోయారు. ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ విజిలెన్స్ అధికారులకు చిక్కారు. ఆయన ఈ మధ్య తరచూ తిరుమల శ్రీవారి దర్శనానికి వస్తున్నారు.. దీంతో టీటీడీ ఉన్నతాధికారులకు అనుమానం వచ్చింది. వెంటనే విజిలెన్స్ అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో నిఘా ఉంచి ఆరా తీస్తే.. తనిఖీల్లో దర్శనం వ్యవహారంలో స్కామ్ బయటపడింది. ఫోర్జరీ ఆధార్ కార్డులతో భక్తులను దర్శనానికి తీసుకెళ్తున్నట్లు గుర్తించారు. ఇలా దర్శనం చేయించినందుకు ఆరుగురి నుంచి రూ.లక్షా 5 వేలు తీసుకున్నట్టుగా తేల్చారు.
ఈ డబ్బుల్ని ఎమ్మెల్సీ డ్రైవర్ అకౌంట్‌కు భక్తులు పంపించినట్లు గుర్తించారు. నెల రోజుల వ్యవధిలో ఏకంగా 19 సిఫార్సు లేఖల్ని ఇచ్చారట. ఈ సిఫార్సు లేఖను ఇతర రాష్ట్రాలకు చెందిన భక్తులకు ఇచ్చినట్లు విజిలెన్స్ అధికారులు గుర్తించారట. కొంతమంది భక్తులు ఫిర్యాదు చేయడంతో ఎమ్మెల్సీపై కేసు నమోదు చేసేందుకు పోలీసులు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
టీటీడీ కూడా ఇటీవలి కాలంలో దళారులపై ఉక్కుపాదం మోపుతోంది. ఎక్కడికక్కడే వారికి అడ్డుకట్ట వేస్తోంది. ఈ క్రమంలోనే ఈ నాలుగేళల్లో వందలాదిమంది దళారుల్ని అరెస్ట్ చేసి కేసులు కూడా నమోదు చేశారు. ఇంత జరుగుతున్నా.. టీటీడీ పదే, పదే హెచ్చరిస్తున్నా కొందరు దళారులు మాత్రం ఇంకా మోసాలు చేస్తూనే ఉన్నారు. ఇటీవల కాలంలో పలువురు భక్తులు దళారీల చేతిలో మోసపోయారు.
ఈ మధ్య విజిలెన్స్ సిబ్బంది పలవురు దళారుల్ని పట్టుకుంది. వీరు వీఐపీ బ్రేక్ దర్శనం పేరుతో భక్తుల్ని మోసగిస్తున్నారు. ఏకంగా రూ.300 టికెట్లు అంటగట్టి వీఐపీ బ్రేక్ దర్శనం అంటూ బురిడీ కొట్టిస్తున్నారు. ఇటీవల భక్తుల ఫిర్యాదుతో పోలీసులు కేసుు నమోదు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఏకంగా ఎమ్మెల్సీ దొరికిపోవడం సంచలనంగా మారింది.. ఈ వ్యవహారంపై విజిలెన్స్ సిబ్బంది ఆరా తీస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.