శ్రీకాకుళం జిల్లా జి.సిగడాం మండలంలో శుక్రవారం ఘోరమైన సంఘటన చోటుచేసుకుంది. మండలంలోని మెట్టవలస కూడలి వద్ద పైల రాంబాబు, మహాలక్ష్మి దంపతులు టిఫిన్ కొట్టు నడుపుకొంటూ జీవనం సాగిస్తున్నారు. సాయంత్రం 5.30 గంటల సమయంలో దుకాణం బయట మంచంపై రాంబాబు కూతురు ఏడాది వయసున్న సాధ్విక నిద్రిస్తోంది. అంతలో ఓ కుక్కల గుంపు అక్కడికి వచ్చి ఆ చిన్నారిపై దాడి చేసి, సమీపంలోని టేకుతోటలోకి ఈడ్చుకెళ్లాయి. చెల్లిపై కుక్కలు దాడిచేయడం చేసి భయపడిన రాంబాబు పెద్ద కుమార్తె కుసుమ ఏడ్చుకుంటూ ఇంట్లోకి వెళ్లి తల్లికి ఆ విషయం చెప్పింది. ఆమె అరుస్తూ బయటకు రావడంతో అటుగా వెళ్తున్న వారు వెంటనే తోటలోకి వెళ్లి చిన్నారిని రక్షించారు. కుక్కల దాడిలో తీవ్రంగా గాయపడిన సాధ్వికను విజయనగరం జిల్లా రాజాం సామాజిక ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ఆ చిన్నారిని కాపాడేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో శ్రీకాకుళం ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు యత్నిస్తుండగా సాధ్విక మృతి చెందింది.