విదర్భ నుంచి తెలంగాణ, రాయలసీమల మీదుగా దక్షిణ తమిళనాడు వరకు ద్రోణి విస్తరించింది. దీని ప్రభావంతో సముద్రం నుంచి భూ ఉపరితలంపైకి తేమగాలులు వీస్తున్నాయి. దీంతో కోస్తా, రాయలసీమల్లోని అనేక ప్రాంతాల్లో శుక్రవారం మేఘాలు ఆవరించాయి. రాయలసీమలో పలుచోట్ల వర్షాలు కురిశాయి. రానున్న 24 గంటల్లో కోస్తాలో పలుచోట్ల, రాయలసీమలో అక్కడక్కడా వర్షాలు కురు స్తాయని, గంటకు 40-50 కి.మీ. వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నెల 25 వరకు కోస్తా, రాయలసీమల్లో వర్షాలు కురుస్తాయని, ఈదురుగాలులు కూడా వీస్తాయని పేర్కొంది. కాగా.. ఎండలు, వడగాడ్పులు శుక్రవారం స్వల్పంగా తగ్గాయి. అనకాపల్లి, ఏలూరు, కాకినాడ జిల్లాల్లో పది మండలాల్లో వడగాడ్పులు వీచాయి. అనేకచోట్ల 40 డిగ్రీలు, అంతకంటే ఎక్కువగా పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కడప జిల్లా కమలాపురంలో 42.7 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. ద్రోణి కారణంగా శని, ఆదివారాల్లో రాష్ట్రంలో అక్కడక్కడా పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.