అమరావతిపై పాలకుల కక్ష సాధింపు తీరుపై పోరుబాటలో భాగంగా ఆత్మాహూతికి సిద్దమని రాజధాని రైతులు అంటున్నారు. రాజధానిలో ఆర్ 5 జోన్ వివాదం రాజుకుంటుంది. రాజధాని అమరావతి వివాదం కోర్టు పరిధిలో ఉండగా, పేదలకు ఇళ్ల కేటాయింపుకు జీవో 45 కేటాయించింది. కృష్ణాయపాలెం, నిడమర్రు, ఐనవోలు, మందడం గ్రామాల పరిధిలో ఆర్ 5 జోన్ గా ప్రకటించి 1134. 58 ఎకరాలు పేదల ఇళ్ల స్దలాలకు ప్రభుత్వం కేటాయింపులు చేసింది. భవిష్యత్ అవసరాలు నిమిత్తం మాస్టర్ ఫాన్ లో ఉంచిన భూములను నవులూరు లో 60 ఎకరాలు, ఎర్రబాలెం 150 ఎకరాలు, కురగల్లు 60 ఎకరాలు అదనంగా నవరత్నాలు పేదలకు ఇళ్లకు వినియోగించుకునేందుకు ప్రభుత్వం సన్నద్దమైంది.
ఒక ప్రక్క ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలని, డిమాండ్ చేస్తూ రాజధాని రైతులు కోర్టుకెక్కారు. రాజధాని ప్రాంతంలో భూములను స్దానికేతరులకు ఇళ్ల స్దలాలు కేటాయింపుపై రాజధాని రైతుల అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపధ్యంలో ఆర్ 5 జోన్ పరిధిలో కేటాయించిన భూములలో సీఆర్డీఏ అధికారులు ప్రోక్లైయినర్లతో చదును చేయిస్తున్నారు. ఈ మేరకు శనివారం కురగల్లులో స్థలాలను జేసీబీ తో చదును చేస్తుండని పనులను స్థానిక రైతులు అడ్డుకున్నారు. దీంతో గ్రామాలలో పోలీసులు భారీగా మోహరించి పనులను అడ్డుకున్న రైతులను ఆదుపులోకి తీసుకుని మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ కు తరలించి, పేర్లు నమోదు చేసుకుని అనంతరం విడుదల చేశారు. దీంతో అమరావతి రాజధాని రైతులు మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ వద్ద నిరసన తెలిపారు. నిరసన తెలిపిన వారిలో అమరావతి జెఎసి నాయకులు ధనేకుల రామారావు, బెల్లంకొండ నరసింహరావు, పువ్వాడ సుధాకర్, కళ్లం రాజశేఖరరెడ్డి, ఆకుల ఉమామహేశ్వరరావు, చిలక బసవయ్య తదితరులు ఉన్నారు.