సాంకేతికత అందుబాటులోకి వచ్చాక సైబర్ నేరాలు బాగా పెరిగిపోయాయి. ఇదిలావుంటే తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పేరుతో ఉన్న నకిలీ వెబ్‌సైట్లను గుర్తించి టీటీడీ చర్యలు తీసుకుంటోంది. ఆదివారం మరో నకిలీ వెబ్‌సైట్‌ను టీటీడీ గుర్తించగా.. పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. టీటీడీ ఫిర్యాదుతో తిరుమల వన్‌టౌన్ పోలీసులు ఎఫ్ఐఆర్ 19/2023 యు/ఎస్ 420, 468, 471 ఐపీసీ ప్రకారం కేసు నమోదు చేశారు. ఈ కేసును ఏపీ ఫోరెన్సిక్ సైబర్ సెల్‌కు అప్పగించారు. సదరు నకిలీ వెబ్‌సైట్‌పై చట్టపరంగా చర్యలు తీసుకోనుండగా.. వీటిపై ఏపీ ఫోరెన్సిక్ సైబర్ సెల్ విచారణ చేపడుతోంది.
ఇప్పటికే 40 నకిలీ వెబ్‌సైట్లపై కేసులు నమోదు కాగా.. తాజాగా నమోదు చేసిన కేసుతో కలిపి మొత్తం కేసుల సంఖ్య 41కి చేరుకుంది. టీటీడీ పేరుతో ఉన్న నకిలీ వెబ్‌సైట్లను నమ్మవద్దని భక్తులకు టీటీడీ విజ్ఞప్తి చేసింది. అధికారిక వెబ్‌సైట్ https://tirupatibalaji.ap.gov.in/ ఉండగా.. చిన్న మార్పులతో కొందరు వ్యక్తులు https://tirupatibalaji-ap-gov.org/ పేరుతో నకిలీ వెబ్‌సైట్‌ను క్రియేట్ చేశారు. ఈ వెబ్‌సైట్‌ను తాజాగా టీటీడీ గుర్తించింది. టీటీడీ అధికారిక వెబ్‌సైట్‌లోనే శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శన టికెట్లు, గదులు బుక్ చేసుకోవాలని టీటీడీ తెలిపింది. దీంతో పాటు టీటీడీ అధికారిక మొబైల్ యాప్ TTDevasthanamsకూడా వినియోగించవచ్చని భక్తులకు స్పష్టం చేసింది. నకిలీ వెబ్‌సైట్లపై ఉక్కుపాదం మోపుతున్నామని, కఠిన చర్యలు తీసుకుంటామని టీటీడీ హెచ్చరించింది.
తిరుమల శ్రీవారి సమాచారం, దర్శన టికెట్ల బుకింగ్, తిరుమల కొండపై రూమ్స్ బుకింగ్ కోసం చాలామంది టీటీడీ వెబ్‌సైట్‌ను సందర్శిస్తూ ఉంటారు. అయితే భక్తులను మోసగించి డబ్బులు సొమ్ము చేసుకునేందుకు కొంతమంది కేటుగాళ్లు టీటీడీ పేరుతో నకిలీ వెబ్‌సైట్లను సృష్టిస్తున్నారు. ఈ నకిలీ వెబ్‌సైట్ల బారిన పడి చాలామంది భక్తులు మోసపోతున్నారు. ఈ వెబ్‌సైట్ల దందాపై పలువురు భక్తులు టీటీడీ విజిలెన్స్ విభాగానికి ఫిర్యాదు చేశారు. దీంతో విజిలెన్స్ డిపార్ట్‌మెంట్ రంగంలోకి దిగి నకిలీ వెబ్‌సైట్లపై నిఘా పెట్టింది. దర్శన టికెట్లు, వసతి గదుల కేటాయింపు, ఉద్యోగాలు కల్పిస్తామంటూ మోసం చేస్తున్నట్లు గుర్తించారు.
ఆంధ్ర, తెలంగాణలోనే కాకుండా, తమిళనాడు, కర్ణాటక, గుజరాత్, మహారాష్ట్ర, ఢిల్లి, ముంబై, కేరళ, వంటి రాష్ట్రాలకు చెందిన కొంతమంది కేటుగాళ్ళు నకిలీ వెబ్‌సైట్లు క్రియేట్ చేసి మోసగిస్తున్నారు. టీటీడీ టికెట్స్ బుకింగ్ చేసుకోవాలంటే చాలా వెబ్ వివిధ సెర్చ్ ఇంజిన్లలో చూపిస్తున్నాయి. అందులో నిజమైన వెబ్‌సైట్ కనుకోవడం చాలా కష్టతరంగా మారింది. దీంతో టికెట్లను బుక్ చేసుకునేటప్పుడు ఒకసారి వెబ్‌సైట్ చెక్ చేసుకోవాలని టీటీడీ సూచిస్తుంది.