ఏపీలోని తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా నేడు పిడుగులు పడే అవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ స్పష్టం చేసింది. పొలంలో పని చేసే రైతులు, కూలీలు, పశు-గొర్రె కాపరులు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. చెట్ల క్రింద ఉండవద్దని విపత్తుల నిర్వహణ సంస్థ పలు సూచనలు జారీ చేసింది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది.
వాయువ్య మధ్యప్రదేశ్ నుండి దక్షిణ తమిళనాడు వరకు ద్రోణి కొనసాగుతోంది. దీని ప్రభావంతో ఈ రోజు రాష్ట్రవ్యాప్తంగా అక్కడక్కడ ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణశాఖ అంచనా వేసింది. రేపు అక్కడక్కడ తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని స్పష్టం చేసింది. ఆదివారం ఉభయగోదావరి, కోనసీమ, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో పాటు మోస్తరు నుండి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో పాటు భారీ వానలు పడతాయని వాతావరణశాఖ అధికారులు పేర్కొన్నారు.
వర్షాలతో పాటు పిడుగులు పడే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అలర్ట్ జారీ చేసింది. పిడుగుల బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, వర్షం పడే సమయాల్లో సురక్షితమైన ప్రదేశాల్లో ఉండాలని సూచించింది. అయితే ఆదివారం ఉదయం నుంచే ఏపీలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఆకాల వర్షాలతో రైతులు నష్టపోతున్నారు. వర్షాలతో రైతుల ధాన్యం పలుచోట్ల తడసి ముద్దయింది. దీంతో రైతులకు తీవ్ర నష్టం జరిగింది. భారీ వర్షాలతో పలుచోట్ల విద్యుత్ స్తంభాలు నెలకొరగ్గా.. ఐకేపీ కేంద్రాల్లో ధాన్యం తడిసిముద్దయింది. ఇక మామిడి నేలకొరగడంతో రైతులు తీవ్ర నష్టపోయారు. ఈదురుగాలులకు ఇంటిపైకప్పులు ఎగిరిపోయాయి. పలు జిల్లాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. మరో రెండు, మూడు రోజుల పాటు భారీ వర్షాలు పడే అవకాశముందని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు. దీంతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.
మరోవైపు ఏపీలోని పలు జిల్లాల్లో ఎండ ప్రభావం పెరగడంతో పాటు వడగాల్పుల తీవ్రత కూడా ఎక్కువైంది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావడం లేదు. మధ్యాహ్నం వేళల్లో జనసంచారం లేక రోడ్లు ఖాళీగా కనిపిస్తున్నాయి. ఎండల తీవ్రత కొనసాగే అవకాశముందని వాతావరణశాఖ స్పష్టం చేసింది.