మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులోతాజాగా విచారణలో కొత్త కోణం చోటుచేసుకుంది. కోఠిలోని సీబీఐ కార్యాలయానికి సునీత భర్త రాజశేఖర్ రెడ్డి చేరుకున్నారు. ఇప్పటికే ఈ కేసులో అరెస్ట్ అయిన భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డిల విచారణ ముగిసిన తర్వాత సీబీఐ ఆధికారులతో రాజశేఖర్ రెడ్డి భేటీ అయ్యారు. వివేకా కేసులో పరిణామాలు వేగంగా మారుతున్న నేపథ్యంలో సునీత భర్త రాజశేఖర్ రెడ్డిని సీబీఐ అధికారులు ప్రశ్నించడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
వివేక రెండో భార్య షమీమ్ సీబీఐ అధికారులకు ఇచ్చిన స్టేట్మెంట్ ఇటీవల వెలుగులోకి వచ్చింది. ఈ స్టేట్‌మెంట్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. రాజశేఖర్ రెడ్డి, అతని సోదరుడిపై షమీమ్ తీవ్ర ఆరోపణలు చేసింది. అనేకసార్లు తనను హెచ్చరించి బెదిరింపులకు దిగారని సీబీఐకు ఇచ్చిన స్టేట్‌మెంట్‌లో పేర్కొంది. ఇలాంటి క్రమంలో రాజశేఖర్ రెడ్డిని సీబీఐ అధికారులు విచారించడం హాట్‌టాపిక్‌గా మారింది. రెండు గంటల పాటు రాజశేఖర్ రెడ్డి సీబీఐ ఆఫీసులో ఉన్నారు. సునీత భర్త రాజశేఖర్ రెడ్డిపై కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి మొదటి నుండి ఆరోపణలు చేస్తున్నారు. దీంతో హత్య జరిగిన రోజు రాజశేఖర్ రెడ్డి ఎక్కడ ఉన్నాడు? ఇతని ఆర్థిక, రాజకీయ వ్యవహారాలతో కూడిన 161 స్టేట్మెంట్ సీబీఐ అధికారులు రికార్డ్ చేసినట్లు తెలుస్తోంది. అన్ని అంశాలపై రాజశేఖర్ రెడ్డిని సీబీఐ ప్రశ్నించింది.
సీబీఐ అధికారులకు పలు కీలక విషయాలను రాజశేఖర్ రెడ్డి వెల్లడించినట్లు చెబుతున్నారు. రాజశేఖర్ రెడ్డి, సునీతపై వైఎస్ అవినాష్ రెడ్డి అనేక ఆరోపణలు చేస్తున్నారు. రాజశేఖర్ రెడ్డి పాత్రపై సీబీఐ అధికారులు విచారణ చేపట్టడం లేదని ఆరోపిస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో రాజశేఖర్ రెడ్డిని సీబీఐ అధికారులు ప్రశ్నించడం చర్చనీయాంశంగా మారింది. ఈ నెల 30తో ఈ కేసు విచారణ పూర్తి చేయాలని సీబీఐకు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఈ కేసు విచారణను సీబీఐ అధికారుల బృందం వేగవంతం చేసింది. ఇటీవల అనినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి, అవినాష్ పీఏ కార్తీక్ రెడ్డిని సీబీఐ అరెస్ట్ చేసింది. ప్రస్తుతం వారిద్దరిని సీబీఐ కస్టడీలోకి తీసుకుని గత రెండు రోజులుగా ప్రశ్నిస్తోంది. వైఎస్ అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీం స్టే విధించింది. దీంతో ఈ కేసులో ఏం జరుగుతుందనేది హాట్‌టాపిక్‌గా మారింది.