చంద్రబాబు రోడ్డుషోలకు, లోకేష్ పాదయాత్రలకు ప్రజా స్పందన లేదని, అందుకే వాళ్ల మీద వాళ్లే రాళ్లు వేయించుకుంటున్నారని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. ఎస్సీ ఎమ్మెల్యేలు, మంత్రులపై దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. లోకేష్ పాదయాత్ర చాలా దారుణంగా ఉందని, పది మంది కూడా పాల్గొనడం లేదన్నారు. మేకలకు లోకేష్ దండం పెట్టుకుంటూ తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. జగనన్నే మన భవిష్యత్తు కార్యక్రమంపై భవానీపురం ఎన్టీఆర్ జిల్లా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజి మంత్రివర్యులు వెలంపల్లి శ్రీనివాసరావు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి మాట్లాడుతూ.. ఈ నెల 7వ తేదీ నుండి రాష్ట్ర వ్యాప్తంగా మెగా పీపుల్స్ సర్వే నిర్వహించడం జరుగుతుందన్నారు. మొదటి 15 రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా కోటి కుటుంబాలకు పైగా ఈ సర్వేలో పాల్గొనగా 79 లక్షలకు పైగా మిస్డ్ కాల్స్ జగనన్న పాలనకు మద్దతుగా వచ్చాయన్నారు. ఈ సర్వే కార్యక్రమంలో క్షేత్ర స్థాయిలో 15 వేల సచివాలయాల పరిధిలో 7 లక్షల మంది జగనన్న సైనికులు పాల్గొన్నారని తెలిపారు.