టీటీడీ తాజగా కీలక నిర్ణయం తీసుకొంది. తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. మే, జూన్‌కు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను ఏప్రిల్ 25న ఉదయం విడుదల చేయనున్నట్లు టీటీడీ ఒక ప్రకటనలో తెలిపింది. రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు మంగళవారం ఉదయం 10 గంటల నుంచి వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయి. టీటీడీ అధికారిక వెబ్‌సైట్ https://tirupatibalaji.ap.gov.in/ ద్వారా భక్తులు రూ. 300 టికెట్లను బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. నకిలీ వెబ్‌సైట్లను నమ్మి మోసపోవద్దని టీటీడీ విజ్ఞప్తి చేసింది. టీటీడీ పేరుతో నకిలీ వెబ్‌సైట్ రూపొందించి మోసాలకు పాల్పడుతున్న ఉదంతం వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో భక్తులకు ప్రత్యేక సూచన చేసింది. భక్తులు దర్శన టికెట్ల కోసం టీటీడీ అధికారిక మొబైల్ యాప్ టీటీడీదేవస్థానం కూడా వినియోగించుకోవచ్చునని తెలిపింది.
మే నెలలో తిరుమలలో విశేష ఉత్సవాలు ఉన్న నేపథ్యంలో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉంది. దర్శన టికెట్ల కోటా విడుదల అనంతరం.. వసతి గృహాల బుకింగ్‌కు సంబంధించిన స్లాట్లను విడుదల చేయనున్నారు. ‘అమాయకులైన భక్తులను లక్ష్యంగా చేసుకుని కొంత మంది అక్రమార్కులు తిరుమల తిరుపతి దేవస్థానం పేరుతో నకిలీ వెబ్‌సైట్‌ను సృష్టించి భక్తులను నట్టేట ముంచేస్తున్నారు. నకిలీ వెబ్‌సైట్లను ఆశ్రయించి మోసపోతున్న భక్తుల సంఖ్య ఎక్కువ కావడంతో పాటు భక్తుల నుంచి అధికంగా ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో నకిలీ వెబ్‌సైట్లపై టీటీడీ ప్రత్యేక దృష్టి సారించింది. భక్తులను మోసగిస్తున్న నకిలీ వెబ్‌సైట్లను గుర్తించి వాటిపై క్రిమినల్ కేసులు పెట్టింది’ అని టీటీడీ తెలిపింది.
ఆన్‌లైన్ టిక్కెట్లు, గదుల కేటాయింపు విషయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, కొందరు కేటుగాళ్లు కొత్త కొత్త తరహాలో భక్తులను మోసగిస్తున్నారని టీటీడీ తెలిపింది. 41 నకిలీ వెబ్‌సైట్‌లను గుర్తించినట్లు వెల్లడించింది. వాటి వివరాలను సేకరించి, వాటిని ఆపరేటర్ చేసే వ్యక్తులను గుర్తించే పనిలో ఉన్నట్లు తెలిపింది. ‘నకిలీ వెబ్‌సైట్ల విషయంలో భక్తులను టీటీడీ ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూనే ఉంది. టీటీడీ అధికారిక వెబ్‌సైట్‌లోనే టికెట్లు, గదుల కేటాయింపుల ప్రక్రియను కొనసాగించాలని విజ్ఞప్తి చేస్తున్నాం’ అని ప్రకటనలో పేర్కొన్నారు.