అనంతపురం జిల్లా తాడిపత్రిలో పోలీసుల్ని భారీగా మోహరించారు. తాడిపత్రి మున్సిపల్ కమిషనర్ జబ్బర్ మియా విధుల పట్ల నిర్లక్ష్యంపై మున్సిపల్ కార్యాలయంలో వంట వార్పుకు మాజీ ఎమ్మెల్యే, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర రెడ్డి పిలుపునిచ్చారు. ఈ క్రమంలో ఆయన సోమవారం మున్సిపల్ కార్యాలయంకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. దీంతో పోలీసులు ముందుగానే అప్రమత్తం అయ్యారు. ఆయన్ను ఇంటి నుంచి బయటకు రాకూడదంటూ పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. జేసీ నివాసం దగ్గర భారీగా పోలీసుల్ని మోహరించారు.
జేసీ ప్రభాకర్ రెడ్డి నివాసం దగ్గరకు పోలీసులు ఎవర్నీ అనుమతించడం లేదు. జేసీ నివాసం చుట్టుపక్కల బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. జేసీని ఇంటి నుంచి బయటకు రాకుండా లోపలే ఉంచారు. టీడీపీ నేతలు, కార్యకర్తలు రాకుండా పోలీసులు అలర్ట్ అయ్యారు. ముందస్తుగా పెద్దపప్పూరు మండలంలో టీడీపీ నేతలు, కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
జేసీ ప్రభాకర్ రెడ్డి మాత్రం హౌస్ అరెస్ట్ నుంచి తప్పించుకుని.. పోలీసుల కళ్లుగప్పి బయటకు వచ్చారు. ఆయన అనుచరులతో కలిసి రోడ్డుపై బైఠాయించి పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జేసీ, పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. జేసీ రోడ్డుపై అడ్డంగా పడిపోయారు.. పోలీసులు ఆయన్నుబలవంతగా అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించారు. గతంలో ఆయన ఇసుక అక్రమ రవాణా జరుగుతోందని.. ఆ రవాణా చేసే వాహనాలను కాల్చేస్తానంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.