ప్రకాశం జిల్లా, రాచర్ల మండలంలోని ఆకవీడు గ్రామంలోని భారతీయ స్టేట్‌బ్యాంక్ బ్రాంచిలో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. రోజువారి విధుల్లో భాగంగా సోమవారం సిబ్బంది 10 గంటల సమయంలో మేనేజర్ ఆధ్వర్యంలో బ్యాంక్‌ను తెరిచారు. విధులు నిర్వహిస్తున్న సమయంలో 11 గంటల ప్రాంతంలో ఏసీ నుంచి చిన్నపాటి మంట మొదలైంది. రెండు నిమిషాల్లో పొగ గది మొత్తం అల్లుకొంది. గమనించిన బ్యాంక్ మేనేజర్, సిబ్బంది బయటకు పరుగుపెట్టారు. గ్రామస్థుల సహాయంతో అందుబాటులో ఉన్న నీటిని చల్లడంతో కొంతమేర మంటలు అదుపులోకి వచ్చాయి. గంటన్నర తరువాత ఫైర్‌ఇంజన్ వచ్చింది. అప్పటికే మంటలను అదుపులోకి తెచ్చారు. మేనేజర్ సత్యనారాయణ మాట్లాడుతూ బ్యాంక్‌లోని ఐదు కంప్యూటర్లు, ఏసీలు, ఎలక్ట్రికల్ సామగ్రి, కొన్ని ఫైళ్లు కాలిపోయాయి. దాదాపు రూ.5లక్షల మేర నష్టం వాటిల్లినట్లు ప్రాథమిక అంచనా వేసినట్లు తెలిపారు. అయితే ప్రజలకు సంబంధించిన నగదు, బంగారానికి ఎటువంటి ప్రమాదం జరుగలేదని, ప్రమాద సంఘటనపై ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చినట్లు తెలిపారు.