వినూత్న నిరసనలు తెలియజేయడంలో మాజీ ఎమ్మెల్యే, తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డిది ప్రత్యేక పంథ. ప్రస్తుతం ఆయన వినూత్న ఆందోళన కొనసాగుతోంది. తాడిపత్రి మున్సిపాలిటీలో జరుగుతున్న అక్రమాలకు నిరసనగా సోమవారం నుంచి ఆయన ఆందోళన చేస్తున్నారు. సోమవారం రాత్రి మున్సిపల్ కార్యలయం ఆవరణలో ఆరు బయట నిద్రించారు. ఉదయం బయటే స్నానం చేసి మళ్లీ శిబిరంలో నిరసన కొనసాగిస్తున్నారు. ఆయనకు టీడీపీ నేతలు, కార్యకర్తలు కూడా సంఘీభావం తెలిపారు.
మున్సిపాలిటీలో అక్రమాలు జరుగుతున్నాయని.. అలాగే కమిషనర్, అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. సోమవారం ఆయన మున్సిపల్ కార్యాలయంలో వంటా వార్పుకు సిద్ధంకాగా.. పోలీసులు ముందుగానే హౌస్ అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఇంటి నుంచి బయటకు వచ్చిన జేసీ రోడ్డుపై బైఠాయించగా.. పోలీసులు తీసుకెళ్లి మళ్లీ ఇంట్లో వదిలేశారు. ఆ తర్వాత నుంచి ఆయన నిరసనను కొనసాగిస్తున్నారు.
మరోవైపు తాడిపత్రి డీఎస్పీ చైత్యనపై ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రభాకర్ రెడ్డి. ఇక్కడ డీఎస్పీ చెప్పిందే లా అండ్ ఆర్డర్.. మున్సిపాలిటీలోనూ డీఎస్పీ జోక్యం చేసుకుంటున్నారని ధ్వజమెత్తారు. టీడీపీ కౌన్సిలర్లపై 307 కేసులు పెడుతున్నారని.. డీఎస్పీ ఎమ్మెల్యేకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యేకి 50 లీటర్ల డీజిల్ మున్సిపాలిటీ నుంచి వేస్తున్నారన్నారు. డీఎస్పీ ఇంకోసారి తన ఇంట్లోకి వస్తే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. మున్సిపాలిటీతో ఆయనకు ఏం సంబంధమని ప్రశ్నించారు. తాను పోలీసుల్ని కించపరచుదలచుకోలేదని.. తాడిపత్రి వాతావరణాన్ని నాశనం చేస్తున్నారని మండిపడ్డారు.
మరోవైపు జేసీ ప్రభాకర్ రెడ్డి హంగామా హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి. రాజకీయ లబ్ధి కోసమే జేసీ ప్రభాకర్ రెడ్డి తాడిపత్రి లో హడావిడి చేస్తున్నారని.. జేసీ ఆరోపణలపై చర్చకు సిద్ధమన్నారు. అవినీతి, అక్రమాలకు కేరాఫ్ జేసీ సోదరులేనని.. ఫోర్జరీ డాక్యూమెంట్లతో జేసీ ట్రావెల్స్ వాహనాలను అక్రమం గా రిజిస్ట్రేషన్ చేయించిన జేసీ ప్రభాకర్ రెడ్డి నీతులు చెప్పటం ఏంటని మండిపడ్డారు. తాడిపత్రి మున్సిపాలిటీ లో ఎక్కడా అక్రమాలు జరగలేదని.. తాడిపత్రి నియోజకవర్గంలో ఇసుక అక్రమ రవాణా లేదన్నారు.