తాజాగా తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ ఆలయాలపై డ్రౌన్లు...హెలికాప్టర్ల పయనం వివాదాస్పదంగా మారతుోంది. ఇదిలావుంటే ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల గగనతలంలో నో ఫ్లై జోన్ నిషేధాజ్ఞలు ఉండడం తెలిసిందే. ఆగమ శాస్త్ర నియమావళి ప్రకారం శ్రీవారి ఆలయంపై విమానాలు, హెలికాప్టర్లు ఎగరడం నిషిద్ధం. అయితే ఇవాళ ఏకంగా మూడు హెలికాప్టర్లు తిరుమల కొండ మీదుగా వెళ్లాయి. స్వామివారి ఆలయం సమీపం నుంచే ఇవి వెళ్లడంతో తీవ్ర కలకలం రేగింది. తిరుమల గగనతలంలో హెలికాప్టర్లు ప్రయాణించడంపై టీడీడీ అప్రమత్తమైంది. ఆ హెలికాప్టర్లు ఎక్కడివన్నదానిపై టీటీడీ విజిలెన్స్ అధికారులు సమాచారం సేకరించే ప్రయత్నం చేస్తున్నారు. కాగా, ఈ హెలికాప్టర్లు భారత వాయుసేనకు చెందినవని, కడప నుంచి చెన్నై వెళుతున్నాయని తెలిసింది. గతంలో తిరుమల కొండపై తీవ్ర కార్చిచ్చు చెలరేగగా, ఆ మంటలను ఆర్పేందుకు భారత వాయుసేన హెలికాప్టర్లను ఉపయోగించారు.