నిషేధిత సంస్థ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా.. కార్యకలాపాలపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ఫోకస్ పెంచింది. మంగళవారం ఉత్తరప్రదేశ్, బీహార్‌తో సహా దేశంలోని డజనుకు పైగా ప్రదేశాలలో సోదాలు నిర్వహించింది. బీహార్‌లో 12, ఉత్తరప్రదేశ్‌లో రెండు, పంజాబ్‌లోని లూథియానా, గోవాలో ఒక్క చోట ఎన్ఐఏ అధికారులు సోదాలు నిర్వహించారు. బీహార్ రాష్ట్రం దర్భంగాలోని ఉర్దూ మార్కెట్‌లో ఎన్ఐఏ దాడులు నిర్వహిస్తోంది.
నిషేధిత పీఎఫ్‌ఐ సంస్థకు సంబంధించిన కార్యకలాపాలపై దర్యాప్తు చేసేందుకే.. ఎన్ఐఏ బృందం ఉర్దూ మార్కెట్‌కు చేరుకుందని పోలీసు వర్గాలు తెలిపాయి. పీఎఫ్‌ఐకి సంబంధించి దర్భంగాలోని ఉర్దూ బజార్‌లో ఉన్న దంత వైద్యుడు డాక్టర్ సరిక్ రజా, సింఘ్వారా పోలీస్ స్టేషన్ పరిధిలోని శంకర్‌పూర్ గ్రామానికి చెందిన మెహబూబ్‌కు చెందిన ఇళ్లు, ఆఫీసుల్లో అధికారులు సోదాలు నిర్వహించారు.
బీహార్ రాష్ట్రం మోతిహారిలోని మరో ప్రదేశంలో, తూర్పు చంపారన్ జిల్లాలోని చకియా సబ్ డివిజన్‌లో ఉన్న కువాన్వా గ్రామంలో ఎన్ఐఏ బృందం సోదాలు చేసింది. పీఎఫ్‌ఐకి సంబంధించిన కేసులో సజ్జాద్ అన్సారీ నివాసంలో సోదాలు జరుగుతున్నాయి. సజ్జాద్ గత 14 నెలలుగా దుబాయ్‌లో పనిచేస్తున్నట్లు సమాచారం. సజ్జాద్ నివాసం నుంచి అతని ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, కొన్ని పత్రాలను ఎన్ఐఏ బృందం స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ గత ఏడాది సెప్టెంబర్‌లో పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్‌ఐ), దాని అనుబంధ సంస్థలను 'చట్టవిరుద్ధమైన సంఘం'గా ప్రకటించింది.