గ్రామం బాగుండాలి, పంటలు బాగా పండాలని కోరుతూ కర్ణాటక రైతులు తిరుమల వెంకన్న సన్నిధికి పాదయాత్రగా బయలుదేరారు. కర్ణాటకలోని బళ్లారి జిల్లా కురుగోడు తాలూకా బాదనహట్టికి చెందిన 60 మంది రైతులు తిరుమల వెంకన్న సన్నిధికి పాదయాత్రగా ఈనెల 24న బయలుదేరారు. వారి యాత్ర బుధవారం అనంతపురం జిల్లా ఉరవకొండకు చేరుకుంది. తమ గ్రామంలో పంటలు బాగా పండి రైతుల కుటుంబాలు సంక్షేమంగా ఉండాలన్న ఉద్దేశంతో పాదయాత్ర చేపట్టినట్లు రైతులు తెలిపారు. వెంకన్న చిత్రపటాన్ని జండాలను చేతపట్టి గోవిందుడి నామస్మరణతో పాదయాత్ర సాగిస్తున్నారు. రోజుకు 40 కిలోమీటర్లు నడిచేలా ప్రణాళిక సిద్ధం చేసుకున్నామన్నారు. 11 రోజుల పాదయాత్ర అనంతరం తిరుమల చేరుకోనున్నారు.