ఏపీ జేఏసీ అమరావతి ఉద్యమ కార్యాచరణలో భాగంగా కృష్ణాజిల్లా విభాగం ఆధ్వర్యంలో మచిలీపట్నం కలెక్టరేట్ వద్ద ధర్నాచౌక్‌లో మంగళవారం ఉద్యోగులు ధర్నా నిర్వహించారు. కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని ఉద్యోగులు నినాదాలు చేశారు. కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సుమన్ మాట్లాడుతూ... కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు నెలవారీగా జీతాలు రాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారన్నారు. కనీసం గుర్తింపు కార్డులు కూడా ఇవ్వలేదన్నారు. అవుట్‌సోర్సింగ్ , కాంట్రాక్టు ఉద్యోగులకు హెల్త్ కార్డులు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. చనిపోయిన ఉద్యోగుల కుటుంబాలకు మట్టిఖర్చులు కూడా ఇవ్వడం లేదని, వెంటనే విడుదల చేయాలన్నారు. కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులు పని ఒత్తిడితో ఇబ్బందులు పడుతున్నారని, వారిని తక్షణం రెగ్యులర్ చేయాలన్నారు. ఉద్యోగంలో చేరిన నాటినుంచి కాంట్రాక్టు , అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల జీతం పెరగలేదని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు అన్ని రాయితీలు కల్పించాలన్నారు. ఏపీ అమరావతి జేఏసీ జిల్లా చైర్మన్ తోట వెంకట సతీష్ మాట్లాడుతూ ఉద్యోగులకు, కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు ప్రతి నెలా మొదటి తారీఖన జీతాలు చెల్లించాలన్నారు. ఉద్యోగులకు పెండింగ్ నాలుగు డీఏల బకాయిలను చెల్లించాలన్నారు. 12వ పే రివిజన్ కమిటీని వెంటనే నియమించాలని కోరారు. కాంట్రాక్టు, అవుుట్‌సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతా లు పెంచాలని ప్రభుత్వాన్ని కోరారు. జిల్లా రెవెన్యూ అసోషియేషన్ అధ్యక్షుడు ఎం.వి.శ్యామ్, అవుుట్ సోర్సింగ్ ఉద్యోగుల జిల్లా అధ్యక్షుడు శాంతారామ్, కో-ఆపరేటివ్ సర్వీసెస్ అసోషియేషన్ జిల్లా అధ్యక్షుడు డి.విజయకుమార్, ఏపీ జేఏసీ జిల్లా కార్యదర్శి వై.వి.రావు, ఉద్యోగులు పాల్గొన్నారు.