రాష్ట్రంలోని 13 జిల్లా కేంద్ర సహకార బ్యాంకు(డీసీసీబీ)ల్లో పనిచేస్తున్న అధికారుల బదిలీలకు ఆప్కాబ్ రంగం సిద్ధం చేసింది. జనరల్ మేనేజర్, డిప్యూటీ జనరల్ మేనేజర్ స్థాయి అధికారులను జోనల్ స్థాయిలో బదిలీ చేయాలని ఆప్కాబ్ ఉన్నతాధికారులు ప్రతిపాదించారు. ఈ మేరకు మూడు, నాలుగు జిల్లాలను ఒక జోన్‌గా నిర్ణయించారు. గుంటూరు, ప్రకాశం, నెల్లూరు ఒక జోన్, చిత్తూరు, అనంతపురం, కర్నూలు, కడప మరోజోన్, కృష్ణా, ఉభయగోదావరి జిల్లాలు ఇంకో జోన్, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జోన్‌గా విభజించారు. గతంలో లేని ఈ విధానాన్ని కొత్తగా తీసుకురావడంపై కొందరు ఉద్యోగులు కోర్టును ఆశ్రయించారు. వచ్చే వారం కోర్టులో వాదనలు జరగనున్నాయి. అయినా కృష్ణా, ఉభయగోదావరి జిల్లాల్లో ఇప్పటికే బదిలీ ఉత్తర్వులు జారీచేసినట్లు తెలిసింది. మిగతా డీసీసీబీల్లో జాబితాలు సిద్ధం చేసినట్లు చెప్తున్నారు. కోర్టు పరిధిలో ఉండగా, బదిలీల ప్రక్రియ చేపట్టడాన్ని ఉద్యోగులు ఆక్షేపిస్తున్నారు. 13 ఉమ్మడి జిల్లాల్లో 65మంది దాకా జీఎం, డీజీఎంలు పని చేస్తున్నారు. వైద్యనాథన్ కమిటీ సిఫారసులకు విరుద్ధంగా జోనల్ వ్యవస్థను తెచ్చి, బదిలీలు చేపడుతున్నట్లు డీసీసీబీ ఉద్యోగులు ఆరోపిస్తున్నారు.