టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర గత 80 రోజులుగా ఎంతో ఉత్సాహంగా కొనసాగుతుంది. ఈరోజు 81వ రోజు పాదయాత్రను మంత్రాలయం నియోజకవర్గం కోసిగి విడిది కేంద్రం నుంచి లోకేష్ పాదయాత్రను మొదలుపెట్టారు. ఈ సందర్భంగా బోపాయి రైతులను లోకేష్ కలిశారు. కోసిగి శివార్లలో మోహన్, శ్రీరామ్ అనే బొప్పాయి రైతులను యువనేత లోకేష్ కలిసి.. వారి కష్టాలను తెలుసుకున్నారు.యువనేత నారా లోకేష్ స్పందిస్తూ.... వైసీపీ ప్రజాప్రతినిధులకు దోచుకోవడం, దాచుకోవడం తప్ప ప్రజల కష్టాలు పట్టడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమీపంలో నీటి వనరులున్నా తాగునీరు అందని దుస్థితి కల్పించడం బాధాకరమన్నారు. గురురాఘవేంద్ర, పులికనుమ ప్రాజెక్టులను చేపల పెంపకం కోసం నీళ్లివ్వకుండా రైతుల నోళ్లుగొట్టడం దారుణమని అన్నారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ ప్రాంతంలో తాగునీటి పథకాన్ని ఏర్పాటు చేసి 24/7 తాగునీరు అందించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. గతంలో మాదిరి సబ్సిడీలు, విత్తనాలు అందించి రైతులను ఆదుకుంటామన్నారు. నరేగా పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేసి రైతులు, కూలీలకు సౌలభ్యంగా ఉండేలా చేస్తామని యువనేత హామీ ఇచ్చారు.