కర్ణాటక నుండి మద్యాన్ని అక్రమంగా తీసుకొచ్చి చిత్తూరులో అమ్ముతున్నారనే సమాచారంతో దాడులు చేసి మద్యంతో పాటు ఓ వ్యక్తిని అరెస్టు చేసినట్లు డీఎస్పీ శ్రీనివాసమూర్తి తెలిపారు. మంగళవారం చిత్తూరు రెండో పట్టణ పోలీస్ స్టేషన్ ఆవరణలో సీఐ మద్దయ్యచ్చారితో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. కొంత కాలంగా కర్ణాటక మద్యాన్ని అక్రమంగా విక్రయిస్తున్న వారిపై నిఘా పెట్టామన్నారు. నగరంలోని ఇందిరానగర్ చివర్లో చెట్ల పొదల వద్ద నలుగురు వ్యక్తులు కారు, ఒక ద్విచక్రవాహనం వద్ద మద్యం బాక్సులను పెట్టుకుని ఉన్నట్లు సమాచారం వచ్చిందన్నారు. అక్కడకు వెళ్లిన పోలీసులను చూసి పారిపోవడానికి ప్రయత్నించగా వారిలో దుర్గానర్‌కాలనీకి చెందిన హేమచంద్రన్‌ను పట్టుకున్నట్లు డీఎస్పీ చెప్పారు. అతడి నుంచి రూ.లక్ష విలువ చేసే కర్ణాటక మద్యం, మద్యాన్ని తరలించడానికి ఉపయోగించిన కారు, మోటారు సైకిల్‌ను స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు.