సీఎం జగన్ సొంత ఇలాకా కడప జిల్లాలోని ఓ దైవసన్నిధిలో బి మఠంలో వీరబ్రహ్మేంద్ర స్వామి ఆరాధన ఉత్సవాలలో వైసీపీ రంగుల షామియానాలు ఏర్పాటు చేయడం అందరినీ విస్మయానికి గురిచేసింది. మండే ఎండలకు భక్తుల సౌకర్యార్ధం చలువ పందిళ్ల ఏర్పాటు కోసం దేవాదాయ శాఖ టెండర్లను పిలిచింది. ఈ క్రమంలో ప్రొద్దుటూరుకు చెందిన అధికార వైసీపీ కాంట్రాక్టర్ ఈ టెండర్‌ను దక్కించుకున్నారు. అయితే వైసీపీ అధిష్టానం మెప్పు పొందాలని భావించాడో.. లేక మరే ఇతర కారణమో తెలియదు కానీ ఆలయంలో సదరు వైసీపీ కాంట్రాక్టర్ వేసిన షామియానాలు చర్చకు దారి తీశాయి. వీరబ్రహ్మేంద్ర స్వామి ఆరాధన ఉత్సవాలలో సాధారణ షామియానాలు కాకుండా వైసీపీ కాంట్రాక్టర్ ఏకంగా వైసీపీ పార్టీకి చెందిన రంగులతో కూడిన షామియానాలు ఏర్పాటు చేశారు. దీంతో భక్తులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. దేవాయంలో పార్టీ రంగులు ఏంటనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. వైసీపీ పార్టీ ప్రోద్భలంతోనే ఇది జరిగిందా అనే అనుమానులు వ్యక్తమవుతున్నాయి. ఏది ఏమైనా దైవ సన్నిధిలో వైసీపీ రంగులతో కూడా షామియానాలు ప్రత్యక్షం అవడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.