గల్వాన్ లోయ ఘర్షణ తర్వాత మొదటిసారిగా భారత్, చైనా రక్షణ మంత్రులు తొలిసారిగా ఢిల్లీలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా చైనాకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ బలమైన సందేశం పంపారు. తూర్పు లడఖ్‌లో సరిహద్దుల ఒప్పందాలను ఉల్లంఘించి ఇరు దేశాల మధ్య సంబంధాలను దెబ్బతీశారని చైనా మంత్రి లీ షాంగ్‌ఫూనకు రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు. అన్ని వివాదాలను ప్రస్తుత ద్వైపాక్షిక ఒప్పందాల ప్రకారమే పరిష్కరించుకోవాల్సి ఉంటుందని తేల్చి చెప్పారు. భారత్ పర్యటనకు వచ్చిన చైనా మంత్రి లీ షాంగ్‌ఫూతో సుమారు 45 నిమిషాలపాటు రాజ్‌నాథ్ భేటీ అయ్యారు.
దాదాపు మూడేళ్లుగా తూర్పు లడఖ్ సరిహద్దుల్లో ప్రతిష్టంభన కొనసాగుతున్న నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. భారత్, చైనాల మధ్య సంబంధాలు మెరుగుపడితే సరిహద్దు వివాదాలకు పరిష్కారం లభిస్తుందని రాజ్‌నాథ్ ఈ సందర్భంగా లీతో పేర్కొన్నారు. సరిహద్దుల్లో శాంతి, ప్రశాంతత నెలకొనడంపైనే భారత్, చైనాల మధ్య సంబంధాల అభివృద్ధి జరుగుతుందని రక్షా మంత్రి స్పష్టంగా తెలియజేశారు. చైనా మంత్రితో సమావేశం అనంతరం రక్షణశాఖ ఒక ప్రకటన విడుదల చేసింది.
‘‘సరిహద్దుల అభివృద్ధి, ఇరు దేశాల సంబంధాలపై ఇద్దరు మంత్రులు నిజాయతీగా మాట్లాడుకున్నారు.. అన్ని వివాదాలను ప్రస్తుతమున్న సరిహద్దు ఒప్పందాల ప్రాతిపదికనే పరిష్కరించుకుందామని రాజ్‌నాథ్ సూచించారు.. సరిహద్దుల్లో శాంతి నెలకుంటే సైనిక సహకారంపై అవగాహనకు రావచ్చని ఆయన స్పష్టం చేశారు’’ అని రక్షణశాఖ వివరించింది. ‘ఇప్పటికే ఉన్న ఒప్పందాలను ఉల్లంఘించడం వల్ల ద్వైపాక్షిక సంబంధాల మొత్తం ప్రాతిపదిక దెబ్బతింటుంది.. సరిహద్దులో విడదీయడం తార్కికంగా తీవ్రతరం అవుతుంది’ అని ఆయన పునరుద్ఘాటించారు.
ఢిల్లీలో జరగనున్న షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీవో) సమావేశాల కోసం చైనా రక్షణ మంత్రి లీ వచ్చారు. 2020లో తూర్పు లడఖ్ సరిహద్దులో వివాదం మొదలైన తర్వాత తొలిసారిగా ఆయన భారత్ పర్యటనకు రావడం గమనార్హం. భారత్, చైనా సైనికాధికారుల మధ్య 18వ విడత చర్చలు జరిగిన కొన్ని రోజులకే ఇద్దరు రక్షణ మంత్రులు భేటీ కావడం విశేషం. ఇదే సమయంలో కజకిస్థాన్, ఇరాన్, తజికిస్థాన్ రక్షణ మంత్రులతోనూ రాజ్‌నాథ్ భేటీ అయ్యారు. భారత్- చైనా ద్వైపాక్షిక సమావేశానికి ముందు వారిని కలిసి కరచాలనం చేశారు. కానీ అక్కడే ఉన్న చైనా రక్షణ మంత్రి లీకి మాత్రం చేతులు జోడించి నమస్కరించారు.