షిర్డీలో సాయిబాబా ఆలయానికి సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్సెస్ (సీఐఎస్ఎఫ్)తో భద్రత కల్పించే ప్రతిపాదనలపై స్థానికులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. సీఐఎస్‌ఎఫ్ భద్రతను వ్యతిరేకిస్తూ మే 1 నుంచి షిర్డీలో నిరవధిక బంద్‌ను చేపడతామని గ్రామస్థులు హెచ్చరించారు. సాయిబాబా ఆలయానికి మరింత భద్రతను కల్పించాలని సాయి సంస్థాన్ ట్రస్టు అధికారులు, మహారాష్ట్ర పోలీసులు నిర్ణయించారు. ఇందులో భాగంగా సీఐఎస్‌ఎఫ్ జవాన్లతో భద్రతను ఏర్పాటు చేయడంపై కసరత్తు చేస్తున్నారు. అయితే ఈ నిర్ణయాన్ని షిర్డీ గ్రామస్థులు వ్యతిరేకిస్తున్నారు.
ప్రస్తుతం బాబా ఆలయ భద్రతను సాయి సంస్థాన్ సిబ్బంది, ఆలయ ప్రాంగణ భద్రతను మహారాష్ట్ర పోలీసులు చూసుకుంటున్నారు. ఆలయాన్ని ప్రతి రోజూ బాంబు స్క్వాడ్ తనిఖీ చేస్తుంది. అయితే, బాబా ఆలయ భద్రతపై సామాజిక కార్యకర్త సంజయ్ కాలే 2018లో బాంబే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన ఔరంగాబాద్ ధర్మాసనం.. షిర్డీ సంస్థాన్ అభిప్రాయాన్ని కోరింది. ఈ నేపథ్యంలో సీఐఎస్‌ఎఫ్‌తో భద్రతకు సాయి సంస్థాన్ మద్దతు పలికింది. అయితే, ఈ నిర్ణయాన్ని షిర్డీ గ్రామస్థులు వ్యతిరేకిస్తూ కోర్టును ఆశ్రయించారు.
ఈ క్రమంలో గురువారం అఖిలపక్ష నాయకులు, గ్రామస్థులు సమావేశమై మహారాష్ట్ర దినోత్సవమైన మే 1 నుంచి బంద్ పాటించాలని నిర్ణయించారు. తదుపరి కార్యాచరణను గ్రామసభ నిర్వహించి ఆ రోజే తెలియజేస్తామని పేర్కొన్నారు. సాయిబాబా మందిరానికి సీఐఎస్‌ఎఫ్‌తో భద్రత వద్దని, సంస్థాన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పోస్టును రద్దు చేయాలని కోరుతున్నారు. ప్రభుత్వ డిప్యూటీ కలెక్టరు, తహసీల్దార్, ప్రాంతీయ అధికారితో కమిటీ ఏర్పాటు, షిర్డీ సాయిబాబా సంస్థాన్ ట్రస్టీల బోర్డును వీలైనంత త్వరగా నియమించాలని కోరుతున్నారు. ఇందులో 50 శాతం ధర్మకర్తలు షిర్డీ గ్రామస్థులనే నియమించాలని కోరుతున్నారు.
మరోవైపు, గ్రామస్థులు సమ్మెకు దిగినా భక్తుల కోసం సాయిబాబా ఆలయం తెరిచే ఉంటుందని సంస్థాన్ ట్రస్ట్ వెల్లడించింది. సాయిబాబా సంస్థాన్‌లో భక్తులు బస, సాయిబాబా ప్రసాదాలయం, క్యాంటీన్ కొనసాగుతాయి. భక్తుల కోసం సాయిబాబా సంస్థాన్‌లోని అన్ని సౌకర్యాలు యధావిధిగా ఉంటాయి. ఇతర అన్ని వ్యాపారాలను పూర్తిగా మూసివేస్తారు.