తన కుమార్తె అక్షతా మూర్తి అతి పిన్న వయసులోనే అమె భర్తను ప్రధానిని చేసిందని ఇన్ఫోసిస్ అధినేత నారాయణమూర్తి సతీమణి, బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ అత్త సుధామూర్తి (ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఆన్‌లైన్‌లో చక్కెర్లు కొడుతోన్న వీడియోలో ‘భార్య మహిమ ఎలా ఉంటుందో చూడండి.. నేను నా భర్తను వ్యాపారవేత్తను చేశాను.. నా కుమార్తె తన భర్తను చిన్న వయసులోనే యూకే ప్రధానిని చేసింది’’ అని సుధామూర్తి చెప్పారు. భర్తను భార్య ఎలా మారుస్తుందో చూడండి...కానీ నేను నా భర్తను మార్చలేక పోయానని ఆమె చమత్కరించారు.
ఇన్ఫోసిస్ సహ-వ్యవస్థాపకుడు నారాయణమూర్తి కుమార్తెను రిషి సునాక్ 2009లో వివాహం చేసుకున్నారు. గతేడాది యూకే ప్రధానిగా రిషి సునాక్ ఎన్నికయ్యారు. ఆధునిక బ్రిటన్ చరిత్రలో అత్యంత పియస్కుడైన ప్రధానిగా రిషి నిలిచారు. ప్రపంచంలోని అత్యంత సంపన్నుల్లో ఒకరైన అక్షతామూర్తి 730 మిలియన్ పౌండ్ల సంపదతో శక్తివంతమైన మహిళగా నిలిచారు. అక్షితామూర్తి తల్లిదండ్రులు నారాయణ మూర్తి, సుధామూర్తిలు. బిలియన్ల విలువైన టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ వీరిదే. అక్షతా మూర్తి తండ్రి నారాయణ మూర్తి అత్యంత సంపన్న భారతీయుల్లో ఒకరు.
ఇదిలావుంటే తన కుమార్తె ప్రధాని రిషి జీవితం, ఆహారపు అలవాట్లను మార్చిందని సుధామూర్తి పేర్కొన్నారు. నారాయణమూర్తి కుటుంబం ప్రతి గురువారం ఉపవాసం ఉండే సంప్రదాయాన్ని పాటిస్తోంది. దీంతో తమ అల్లుడు రిషి కూడా గురువారాల్లో ఉపవాసం ఉంటున్నారని సుధామూర్తి చెప్పారు.
‘అవును గురువారమే మొదలు పెట్టాలి అంటే గురువారమే ఇన్ఫోసిస్ ప్రారంభించారు.. అంతే కాదు! మా అమ్మాయిని పెళ్లి చేసుకున్న మా అల్లుడు... వాళ్ల పూర్వీకులు 150 సంవత్సరాల నుంచి ఇంగ్లండ్‌లో ఉన్నా వారికి మతవిశ్వాసం ఎక్కువే.. పెళ్లయ్యాక నువ్వు గురువారమే ఎందుకు మొదలు పెట్టావు అని అడిగారు. రాఘవేంద్ర స్వామి వద్దకు వెళ్దాం అన్నారు. అతను ప్రతి గురువారం మంచి రోజు చెప్పిన తర్వాత ఉపవాసం ఉంటున్నాడు... మా అల్లుడి అమ్మ ప్రతి సోమవారం ఉపవాసం ఉంటుంది కానీ మా అల్లుడు గురువారం ఉపవాసం ఉంటాడు’ అని అన్నారు.
రిషి సునాక్, అతని భార్య, తండ్రి యొక్క బిలియనీర్ హోదా కారణంగా గత నాలుగేళ్ల నుంచి పదేపదే విమర్శలకు గురవుతున్నారు. తన కుటుంబ ఆర్థిక ప్రయోజనాలను పూర్తి స్థాయిలో ప్రకటించారా? అనే ప్రశ్నలను లేవనెత్తింది. దీనిపై తరుచూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.