ఓ జంట విడాకుల కేసులో సర్వోన్నత న్యాయస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. 25 ఏళ్లుగా విడివిడిగా ఉంటున్న జంటను వివాహితులుగా గుర్తిస్తే క్రూరత్వానికి అనుమతి ఇచ్చినట్లు అవుతుందని పేర్కొంటూ వారి వివాహాన్ని రద్దు చేసింది. వివాహం తర్వాత నాలుగు సంవత్సరాలు మాత్రమే ఈ జంట కలిసుండగా.. మనస్పర్ధలతో 25 ఏళ్ల నుంచి వేర్వేరుగా ఉంటున్నారు. విడాకులు కోరుతూ ఈ జంట దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ సుధాన్షు ధులియా, జస్టిస్ జేబీ పార్దివాలాలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ‘అన్ని అర్ధవంతమైన సంబంధాలను పూర్తిగా తెంచుకోవడం, హిందూ వివాహ చట్టం ప్రకారం ఇరువురు మధ్య ఉన్న చేదు అనుభవాన్ని క్రూరత్వంగా ధర్మాసనం అభివర్ణించింది.
‘వివాహమైన తర్వాత నాలుగేళ్లు కలిసి, గత 25 ఏళ్లుగా విడివిడిగా జీవిస్తున్న జంట మన ముందున్నారు. వారికి పిల్లలు లేరు.. వారి వైవాహిక బంధం మరమ్మత్తు చేయలేని విధంగా పూర్తిగా విచ్ఛిన్నమైంది.. ఈ బంధానికి ముగింపు పలకాలి అనే విషయంలో మాకు ఎటువంటి సందేహం లేదు, ఎందుకంటే దాని కొనసాగింపు క్రూరత్వమే అవుతుంది.. సుదీర్ఘకాలం విడిపోవడం, సహజీవనం లేకపోవడం, అర్ధవంతమైన బంధాలన్నింటినీ పూర్తిగా తెంచుకోవడం, ఇద్దరి మధ్య ఉన్న చేదును హిందూ వివాహ చట్టం ప్రకారం క్రూరత్వంగా పేర్కొవాలి’ అని వ్యాఖ్యానించారు.
దంపతులకు పిల్లలు లేనందున వారి వివాహం ముగింపు మాత్రమే ప్రభావం చూపుతుందని పేర్కొంది. భర్త నెలకు రూ.లక్ష సంపాదిస్తున్నందున.. భార్యకు భరణం కింద మొత్తం రూ.30 లక్షలు చెల్లించాలని ఆదేశించింది. ఈ మొత్తాన్ని నాలుగు వారాల్లోగా అందజేయాలని స్పష్టం చేసింది. ఢిల్లీకి చెందిన ఈ దంపతులకు 1994లో వివాహం జరిగింది. అదే ఏడాది భార్య గర్బం దాల్చగా.. తనకు తెలియకుండానే అబార్షన్ చేయించుకుందని భర్త ఆరోపించాడు. అంతేకాదు, తమది చాలా చిన్న ఇల్లు అని ఇష్టపడలేదని తెలిపాడు.
పెళ్లైన నాలుగేళ్ల తర్వాత భర్త ఇంటి నుంచి వెళ్లిపోయిన ఆమె... వరకట్న వేధింపుల కేసు పెట్టింది. దీంతో పోలీసులు కేసు నమోదుచేసి భర్త, అతడి సోదరుడ్ని అరెస్ట్ చేశారు. అనంతరం బెయిల్‌పై విడుదలైన భర్త.. విడాకుల నోటీసు పంపాడు. ఏళ్లుగా భార్యాభర్తలు విడివిడిగా ఉండటంతో ట్రయల్ కోర్టు వారికి విడాకులు మంజూరు చేసింది. ఈ నిర్ణయాన్ని సదరు మహిళ ఢిల్లీ హైకోర్టులో సవాల్ చేయగా.. కింది కోర్టు తీర్పును తిరస్కరించింది. దీంతో భర్త సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో వివాహాన్ని రద్దు చేసింది.