ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన తెలిపిన రెజ్లర్ల పిటిషన్‌పై శుక్రవారం సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా ఢిల్లీ పోలీసుల తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా మాట్లాడుతూ.. బ్రిజ్ భూషణ్ పై వచ్చిన ఆరోపణలకు సంబంధించి ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని నిర్ణయించుకున్నామని చెప్పారు. రెజ్లర్ల తరఫున న్యాయవాది కపిల్ సిబల్ వాదించారు.
రెజ్లర్లకు భద్రత కల్పించాలని కపిల్ సిబల్ డిమాండ్ చేశారు. అలాగే విచారణ కోసం ఎస్టీఎఫ్ ఏర్పాటు చేయాలని కోరారు. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి పర్యవేక్షణలో విచారణ జరగాలని సిబల్ విజ్ఞప్తి చేశారు. దీనిపై సొలిసిటర్ జనరల్ మెహతా క్లారిటీ ఇచ్చారు. ఈ విషయాన్ని ఢిల్లీ పోలీస్ కమిషనర్‌కే వదిలేయాలని.. పోలీస్ కమీషనర్ బాధ్యతగల అధికారి అని గుర్తు చేశారు.
అనంతరం సీజేఐ డీవై చంద్రచూడ్ మాట్లాడుతూ.. 'సొలిసిటర్ జనరల్.. మేము మీ స్టేట్‌మెంట్‌ను రికార్డు చేస్తున్నాం. ఒక వారం తర్వాత మాకు మరింత సమాచారం ఇవ్వాలి' అని ఆదేశించారు. ఈ కేసు మళ్లీ వచ్చే శుక్రవారం విచారణకు రానుంది. అయితే.. సుప్రీం కోర్టులో సొలిసిటర్ జనరల్ హామీ ఇచ్చినా.. రెజ్లర్లు మాత్రం నిరసన విరమించలేదు. బ్రిజ్ భూషణ్ సింగ్‌ను జైలుకు పంపే వరకు తాము పోరాటం చేస్తామని స్పష్టం చేస్తున్నారు.