విజయనగరం జిల్లా భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణానికి, విశాఖలో అదానీ డేటా సెంటర్‌కు సీఎం జగన్ మే 3న శంకుస్థాపనలు చేస్తారు. ముఖ్యమంత్రి ఆరోజు ఉదయం విజయవాడ నుంచి బయలుదేరి 9.20 గంటలకు విశాఖపట్నం విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి ఉదయం పది గంటలకు భోగాపురం సమీపాన గల రావివలస వెళతారు. అక్కడ జీఎంఆర్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌ను సందర్శిస్తారు. అనంతరం విమానాశ్రయం నిర్మాణానికి శంకుస్థాపన ఫలకం ఆవిష్కరిస్తారు. ఆ తరువాత చింతపల్లి ఫిష్ ల్యాండింగ్ సెంటర్‌కు, తారకరామ తీర్థ సాగర్, తదితర పనులకు శిలాఫలకాలు ఆవిష్కరిస్తారు. అనంతరం మధ్యాహ్నం 12.30 గంటల వరకు బహిరంగ సభలో పాల్గొని అక్కడ గంటసేపు స్థానిక నాయకులతో మాట్లాడతారు. 1.20 గంటలకు తిరిగి హెలికాప్టర్‌లో బయలుదేరి రుషికొండ ఐటీ పార్కులోని హిల్ నంబర్-3పై దిగుతారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన హిల్ నంబర్-4కి చేరుకుంటారు. 2.30 గంటల వరకు రిజర్వ్ చేశారు. ఆ తరువాత అదానీ డేటా సెంటర్ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొంటారు. 3.45 గంటల వరకు అక్కడే ఉంటారు. ఆ తరువాత రుషికొండలో ఎంవీ ఎంవీవీ సత్యనారాయణ ఇంటికి వెళ్లి ఇటీవల వివాహం జరిగిన ఆయన కుమారుడు, కోడల్ని దీవిస్తారు. 4.35 గంటలకు మళ్లీ హిల్‌నంబర్-3పై ఏర్పాటుచేసిన హెలిప్యాడ్ వద్దకు వచ్చి అక్కడ స్థానిక నాయకులతో 20 నిమిషాలు చర్చిస్తారు. సాయంత్రం ఐదు గంటలకు హెలికాప్టర్‌లో బయలుదేరి విశాఖ విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడి నుంచి విజయవాడ వెళతారు.