ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా, రాజానగరం ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయంలో సచివాలయ ఉద్యోగులు, వలంటీర్లతో శుక్రవారం సాయంత్రం పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ప్రభుత్వ సలహాదారు పోతిరెడ్డి నాగార్జునరెడ్డి సమీక్షించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ... టీడీపీ ప్రభుత్వం వస్తే ముందుగా లేపేసేది వలంటీర్లు, సచివాలయ వ్యవస్థలనేనని చెప్పారు. సచివాలయ ఉద్యోగుల బదిలీలకు సీఎం అంగీకరించారని చెప్పారు. రాష్ట్రంలో కొన్ని చోట్ల సచివాలయ సిబ్బంది సరైన గౌరవం ఇవ్వడంలేదని వైసీపీ నాయ కులు కొందరు ఫిర్యాదులు చేస్తున్నారన్నారు.అటువంటి వారు దూరంగా బదిలీ అవుతారని హెచ్చరించారు. అనంతరం రాజానగరం మండలం లో జరుగుతున్న ఉపాధి హామీ పనులు, గ్రామ సచివాలయాలు, ఉద్యోగుల పనితీరును పరిశీలించారు.రాజానగరంలోని పేరమ్మ చెరువు పూడికతీత పనులు పరిశీలించి ఉపాధి కూలీల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పల్లకడియంలో రైతుమిత్ర గ్రూపునకు మంజూరైన ట్రాక్టర్, వరికోత యంత్రాలను ప్రారంభించారు.కార్యక్రమంలో జడ్పీ సీఈవో సత్యనారాయణ,డీపీవో జగదాంబ, డీఎల్‌పీవో వీణా దేవి, డ్వామా పీడీ రామ్‌గోపాల్, ఏపీడీ శ్రీనివాస్, రాజానగరం ఎంపీడీవో బి.రామారావు,సర్పంచ్ కుందేటి ప్రసాద్, బత్తినకరుణాకర్ పాల్గొన్నారు.