ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని కొండ్రుప్రోలు, ఎల్.అగ్రహారం, కుంచనపల్లె, పడాల, ప్రత్తిపాడు గ్రామపంచాయితీలకు సంబంధించిన స్థిర-చర ఆస్తులు, రికార్డులను తాడేపల్లిగూడెం మున్సిపాలిటీకి అప్పగించాలని గ్రామపంచాయితీ కార్యదర్శులను ఆదేశిస్తూ కలెక్టర్ ఇచ్చిన ప్రొసీడింగ్స్‌పై యధాతథస్థితి పాటించాలని హైకోర్టు ఆదేశించింది. ఈ వ్యవహారంపై పూర్తి వివరాలను న్యాయస్థానం ముందు ఉంచాలని అధికారులను ఆదేశిస్తూ నోటీసులు జారీ చేసింది. విచారణను వచ్చేవారానికి వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఆర్.రఘునందనరావు శుక్రవారం ఆదేశాలిచ్చారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని కొండ్రుప్రోలు, ఎల్ అగ్రహారం, కుంచనపల్లె, పడాల, ప్రత్తిపాడు గ్రామపంచాయితీలకు సంబంధించిన స్థిర-చర ఆస్తులు, రికార్డులను తాడేపల్లిగూడెం మున్సిపాలిటీకి అప్పగించాలంటూ ఆయా గ్రామపంచాయితీల కార్యదర్శులను ఆదేశిస్తూ ఈ నెల 15న కలెక్టర్ ఇచ్చిన ప్రొసీడింగ్స్‌ను సవాల్ చేస్తూ సోమ వెంకట శంకరరావుతో పాటు మరో 23మంది హైకోర్టును ఆశ్రయించారు. పిటిషనర్ల తరఫున న్యాయవాది యలిశెట్టి సోమరాజు వాదనలు వినిపించారు. రాష్ట్రంలోని పలు గ్రామపంచాయితీలను సమీప మున్సిపాలిటీల్లో విలీనం చేస్తూ ప్రభుత్వం చట్టం తీసుకొచ్చిందన్నారు. ఆ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పలు వ్యాజ్యాలు దాఖలయ్యాయన్నారు. ప్రస్తుత పిటిషన్ దాఖలు చేసిన పలు గ్రామపంచాయితీల ప్రజలు సైతం విలీనాన్ని వ్యతిరేకిస్తూ వ్యాజ్యం వేశారన్నారు. వివాదం తేలేవరకు మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించబోమని అడ్వకేట్ జనరల్ కోర్టుకు హామీ ఇచ్చారన్నారు. రిట్ పిటిషన్లు పెండింగ్‌లో ఉండగా, కోర్టుకు ఇచ్చిన హామీకి భిన్నంగా గ్రామాలను దొడ్డిదారిలో మున్సిపాలిటీలో విలీనం చేసేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. కలెక్టర్ ఇచ్చిన ప్రొసీడింగ్స్ అందులో భాగమేనన్నారు. ఈ వివరాలు పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి కలెక్టర్ ఇచ్చిన ప్రొసీడింగ్స్‌పై యధాతథస్థితి పాటించాలని ఆదేశిస్తూ, ఈ వ్యవహారానికి సంబంధించి పూర్తివివరాలు న్యాయస్థానం ముందు ఉంచాలని అధికారులను ఆదేశించారు.